ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్..!
జపాన్‌లోని జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు మరియు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.