కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
- ఈదురు గాలుల దాటికి నేలరాలిన అరటి...మామిడి
- వడగండ్లతో తడిచిపోయిన ధాన్యం
- పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర నష్టం
- గాలుల బీభత్సానికి కొట్టుకుపోయిన షెడ్లు
కడప జిల్లాలో అకాలంగా కురిసిన వర్షం, ఈదురు గాలులు తీవ్ర భీభత్సం సృష్టించాయి. ఈ గాలులు పులివెందుల ప్రాంత ఉధ్యాన రైతులను నిలువునా ముంచేశాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలు, వడగళ్లకు పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది. పులివెందుల ప్రాంతంలోని లింగాల, తొండూరు, పులివెందుల మండలాల పరిధిలో ప్రధానంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక లింగాల మండలంలోని 250 హెక్టార్లకు పైగా అరటి పంటకు నష్టం వాటిల్లింది. తొండూరు, పులివెందుల మండలాల్లో మరో 50 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. వర్షం తక్కువగా కురిసినా.. ఈదురు గాలుల ఫలితంగా అరటి చెట్లు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. ఈ ఈదురుగాలుల కారణంగా ఒక పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర పంట నష్టం జరిగిందని అంచనా. ప్రస్తుతం అరటికి మంచి ధర పలుకుతున్న నేపథ్యంలో.. ఇలా ఈదురుగాలులకు అరటి చెట్లు నేలకొరగడంతో అరటి రైతులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటే తప్ప కోలుకోలేని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఉద్యాన శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లాలోనూ అదే పరిస్థితి..
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని కుర్నూతల, పందిళ్లపల్లె గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షానికి ఈదురు గాలులు తోడై మామిడి రైతును కుదేలు చేశాయి. కురునూతల సర్పంచ్ రమణయ్య ఇంటిపై ఉన్న రేకులు గాలులు దాటికి లేచిపోవడంతో ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలతోపాటు వంట సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. పందిళ్లపల్లె గ్రామంలో ఈదురు గాలులు దాటికి మామిడి రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే అరకొరా ఉన్న మామిడి పంట ఈదురు గాలులకు పూర్తిగా నేలరాలిపోవడంతో రైతన్నకు కంట కన్నీరే మిగిలింది. ప్రతి ఏడాది ఏప్రిల్, మే మాసంలో ఈదురు గాలులు, వడగళ్ల వర్షానికి మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఉద్యాన శాఖ అధికారులు తూతూ మంత్రంగా రైతులు వివరాలు సేకరించడం తప్ప.. ఇప్పటివరకు మామిడి రైతుకు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఈ ఏడాది మామిడి రైతు ఎకరాకు రూ.2500 ఇన్సూరెన్స్ కొరకు జమ చేయడం జరిగింది. ఇప్పటికే వాతావరణంలో మార్పులతో పంట రాకపోవడంతోపాటు ఎక్కడో అరకొర ఉన్న పంట కాయ దశలోనే ఈదురు గాలులు దాటికి నేలరాలిపోయి దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుకు ఇన్సూరెన్స్ ద్వారా మేలు చేకూర్చుతుందో లేదో చూడాలి.