ఉక్రెయిన్ రష్యా దాడిపై ట్రంప్ వ్యాఖ్యలు
ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది చాలా భయంకరమైన చర్య అని.. అసలు యుద్ధమే ఓ భయంకరమైన విషయం అని అన్నారు. పుతిన్ తప్పు చేస్తున్నాడని తాను ఇప్పటికే చెప్పినప్పటికీ ఈ దాడులు మరింత దారుణమని కామెంట్ చేశారు. దాడులపై అమెరికా జాతీయ భద్రతా మండలి స్పందిస్తూ.. ఇలాంటి విధ్వంసం జరుగుతుంది కాబట్టే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ కృషి చేస్తున్నారని అన్నారు. యుద్ధం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఈ దాడుల వల్ల మరోసారి ప్రూవ్ అయ్యిందని అన్నారు.
కాగా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అమెరికా అధ్యక్ష రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ రష్యాకు వెళ్లిన రెండు రోజుల తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ వేదికగా రష్యాతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించగా.. మాస్కో కూడా అంగీకారం తెలిపింది. అయినా కూడా దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ట్రంప్ మండిపడ్డారు. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ టారీఫ్ లు మార్మోగుతున్న సంగతి తెలిసిందే.