84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!
కడప-చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. కడప- తిరుపతి ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా.. స్మగ్లర్లు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. భాకరాపేట చెక్‌పోస్ట్ దగ్గర సైతం వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా.. అతివేగంగా వెళ్లిపోవడంతో అటవీశాఖ అధికారులు వెంబడించారు. అటవీ అధికారులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న స్మగ్లర్లు కడప శివార్లలో లారీని వదిలి పరారయ్యారు. క్యాబేజీ సరఫరా పేరుతో.. లారీలో 84 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు 2.25 టన్నులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రెండు కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా కడప డీఎఫ్‌వో వినీత్ కుమార్ ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. 84 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. మినీ లారీలో స్మగ్లర్లు వదిలేసిన మొబైల్ ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో పరారైన పీలేరు జిల్లా రేగళ్లకు చెందిన మురళి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు చెప్పారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాలో చిక్కుకొని విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.