ముగిసిన అఘోరీ కథ?
- యుపీలో అరెస్టు అయిన అఘోరీ మాత సిటీకి తరలింపు
- నార్సింగి ఎసిపి ఆఫీస్ లో అయిదు గంటల విచారణ
- మోకిలా పిఎస్ లో ఫిర్యాదు నేపధ్యంలో అరెస్టు
- క్షణాల్లో జరిగిపోయిన అరెస్టు.. రిమాండ్.. జైల్ తరలింపు
- కస్టడీకి తీసుకొని విచారిస్తామంటున్న పోలీసులు
- ఒకే జైల్.. ఒకే బ్యారెక్ లో వర్షిణీని తనను ఉంచాలని అఘోరీ హంగామా
- అఘోరీ కథ ముగిసినట్లేనా అంటూ నెటిజన్ల ప్రశ్న
రెండు రాష్ట్రాల్లో తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయిన అఘోరీ శ్రీనివాస్ మాత కథ ముగిసినట్లేనా.. మోకీల పోలీసులు అరెస్టు అనంతరం ఇక మాత బయటకు రావడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నది వాస్తవమేనా.. పూజల పేరుతో మాత చేసిన అరాచకానికి శుభం కార్డు పడినట్లైనా అంటే సైబారాబాద్ కమిషనరేట్ పోలీసులు అవుననే చెబుతున్నారు. మాత బయటకు రాకుండా కేసుల మీద కేసులు వేసి జైల్లోనే ఉండేలా చూస్తామన్నారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అయితే మాతను మెడికల్ టెస్టు చేసి జైలుకి పంపినా తన ముచ్చటైన మూడో భార్యతో తనను ఒకే జైలు, ఒకే బ్యారెక్ లో పెట్టాలని పోలీసులకు వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం.
వర్షిణీతో పెళ్లి తరువాత అఘోరీపై ఆంధ్ర, తెలంగాణ పోలీసు స్టేషన్లలో అనేక ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే సిఎం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అఘోరీ మాత పనిపట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోకిల పోలీసులు యు.పిలో దాక్కున అఘోరీ మాతను వెతికి పట్టుకున్నారు. భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలించిన అనంతరం నార్సింగి ఎసిపి కార్యాలయంలో దాదాపూ అయిదు గంటలపాటు విచారణ చేశారు. మోకిల పిఎస్ లో ఓ సినీ ప్రొడ్యూసర్ సోదరిని మాత మోనీ పూజ పేరుతో పదిలక్షలు కాజేసిందని ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే అరెస్టు చేసినట్లు ధృవీకరించిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
రాజేంద్రనగర్ కోర్టు 14రోజులపాటు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి సబ్ జైలుకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తన వెంట తన భార్య వర్షిణీని సైతం పంపాలని అఘోరి మాత తెగ గొడవ చేసిందట. తన వెంట రాక పోతే జైల్లో ఆత్మార్పణం అంటూ బెదిరించినా పోలీసులు బెండు తీస్తామని చెప్పడంతో మాతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అరెస్టు, రిమాండ్, జైల్ కి తరలింపు చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే పదికి పైగా కేసులు ఉన్న మాతను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే తాను చేసిన మోసాలు బయటపడుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అతనిపై పెట్టిన కేసుల నుండి ఇప్పుడిప్పుడే బయట పడటం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇక వర్షిణీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, ఆమె కోరిక మేరకు అయితే తల్లిదండ్రులకు, లేదా హోంకి తరలిస్తామని తెలిపారు.
ఏదిఏమైనా నానా కథ నడిపిన అఘోరీ శ్రీనివాస్ మాత సినిమాకు పోలీసులు శుభం కార్డు వేసినట్లైంది. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అఘోరీ అరెస్టు విషయం తెలిసిన పోలీసులు పిటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.