కేపీహెచ్‌బీ మర్డర్ కేసులో ముగ్గురు అరెస్ట్..!
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్‌లో భర్తను చంపిన భార్య కేసులో ముగ్గురిని పోలీసుల అరెస్ట్ చేశారు. మృతుడు సాయిలు భార్య కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. సాయిలు, అతని కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న అవమానకరమైన ప్రవర్తనను తట్టుకోలేక సాయిలును చంపేందుకు పన్నాగం పన్నారు. హత్యకు తనకు సహాయం చేయమని జ్యోతి, మల్లేష్‌ను కవిత కోరింది. ప్లాన్ ప్రకారం సాయిలును నగరానికి తీసుకొని వచ్చి, జ్యోతి-మల్లేష్ ఇంటి దగ్గర అవకాశం కోసం ఎదురు చూసి, గత శుక్రవారం రాత్రి మద్యం తాగించి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ముందు మద్యం మత్తులో సాయిలుకు విద్యుత్ వైర్లతో షాక్ ఇచ్చిన కవిత అండ్ టీమ్.. సాయిలు మృతిచెందక పోవటంతో గొంతు నులిమి, వృషణాలపై దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు సంచిలో మృతదేహాన్ని వేసి ఓ ఆటోలో జోగిపేట వరకు తరలించిన తర్వాత.. ఆటో డ్రైవర్‌కు అనుమానం రావటంతో మళ్లీ వారిని ఎక్కించుకున్న చోటనే దించేశాడు. దీంతో మిత్రా హిల్స్ పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని నిందితులు పూడ్చిపెట్టారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.