తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..

By Ravi
On
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..

  • ఈనెల 11 నుంచి నల్లమలలో ప్రారంభం కానున్న సాహసయాత్ర
  • ఏడాదిలో మూడురోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అవకాశం
  • అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌పరిధిలో కొండలు, లోయల్లో ప్రకృతి రమణీయ ప్రదేశంలో కొలువైన లింగమయ్యస్వామి
  • ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున లింగమయ్యకు చెంచుల ప్రత్యేక పూజలు

తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా పిలుచుకునే సలేశ్వరం జాతర ఈనెల 11 నుంచి 13 వరకు కొనసాగనుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, నీటి గుండాలు, ప్రకృతి రమణీయ ప్రదేశంలో లోయలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకోవాలంటే సహాసమైన యాత్ర చేయాల్సిందే. ఎత్తైన కొండలు ఎక్కుతూ, లోయలను దిగుతూ, సెలయేర్లు, రాళ్లను దాటుకుంటూ సుమారు 6 కి.మీ మేర కాలినడకన ప్రయాణించి సలేశ్వర లింగమయ్యను చేరుకోవాల్సి ఉంటుంది. సలేశ్వర క్షేత్రం దట్టమైన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌పరిధిలో ఉండటంతో ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అనుమతి ఉంటుంది. దీంతో చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా స్థానిక చెంచులు నిర్వహించే ఈ జాతరకు లక్షమందికి పైగా ప్రజలు హాజరవుతారు.

 ఏడాదికి మూడు రోజులే దర్శనం..
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కావడంతో పులులు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎవరినీ అడవిలోనికి అనుమతించరు. కేవలం ఏడాది మూడు రోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అటవీశాఖ అనుమతిస్తుంది. ఈనెల 11 నుంచి 13 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అడవిలోనికి వాహనాలకు ప్రవేశం ఉంటుంది. ఎంతో కష్టపడి ఎత్తైన  కొండలు ఎక్కుతూ, ఏటవాలుగా ఉన్న బండలను దాటుకుంటూ, లోయల్లోకి దిగుతూ సలేశ్వర లోయ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి ప్రకృతి రమణీయతకు అప్పటిదాకా పడ్డ కష్టాన్ని మర్చిపోయి భక్తులు మధుర అనుభూతి పొందుతారు. సుమారు 200 అడుగుల ఎత్తులో నుంచి జాలువారే జలపాతం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి సలేశ్వర గుండంలోనే అడవిలోని పులులు, వన్యప్రాణులు దాహం తీర్చుకుంటాయి.
ఆలయంలో చెంచులే పూజారులు..
సలేశ్వరం లింగమయ్య ఉత్సవాల్లో స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున లింగమయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎత్తైన  కొండల మధ్య, సుమారు 200 మీటర్ల లోతులో ఉన్న లోయ అడుగున ఉన్న గుహలో లింగమయ్య స్వామి కొలువై ఉన్నాడు. కేవలం పిడికెడు ఎత్తులో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో దారిపొడవునా ఉచిత భోజనం, మంచినీటి సౌకర్యాలను కల్పిస్తారు.
లింగమయ్య దర్శనానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..
సలేశ్వర లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారిలో మన్ననూర్‌ తర్వాత వచ్చే ఫర్హాబాద్‌ చౌరస్తాకు చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం నుంచి వచ్చే వారు దోమలపెంట, వటవర్లపల్లి మీదుగా ఫర్హాబాద్‌ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి అటవీమార్గంలో 31 కి.మీ దూరంలో ఉన్న రాంపూర్‌ పెంటకు చేరుకోవాలి. అక్కడి నుంచి మరో 3 కి.మీ దూరం ఎత్తైన కొండలు, లోయలు దాటుకుంటూ ట్రెక్కింగ్‌ ద్వారా సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. భక్తి పారవశ్యంతో వస్తున్నాం.. లింగమయ్య.. అంటూ భక్తులు చేసే ఆర్థనాదాలతో నల్లమల మార్మోగుతుంది. లింగమయ్య ఉత్సవాలకోసం ఆర్టీసీ అచ్చంపేట నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తోంది.

WhatsApp Image 2025-04-10 at 5.24.41 PM

Advertisement

Latest News

మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ...
విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ