ఆ కారణంతో రక్షణ అడగొద్దు: హైకోర్టు
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంట.. ఆ కారణంతో పోలీసు రక్షణ కోరలేరని అలహాబాద్ హైకోర్టు కామెంట్ చేశారు. తమ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తామని వెల్లడించింది. జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని న్యాయస్థానం సూచించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శ్రేయ, ఆమె భర్త అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
తన తీర్పులో.. వీరి పిటిషన్ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు ఎలాంటి తీవ్రమైన ముప్పు పొంచి లేదని అర్థమవుతోంది. కేవలం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన అలాంటి జంటకు పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇదేతరహా కేసులో తీర్పునిచ్చింది. దాని ఆధారంగా తాజా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదు. నిజంగా ముప్పు ఉండే కేసులకు మేం భద్రత కల్పిస్తాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.