ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!
హైదరాబాద్ TPN : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదన్నారు. మోడీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అన్నారు. కులగణనతో రాహుల్‌గాంధీ మోదీకి రాజకీయంగా మరణ శాసనం రాశారన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ-అమిత్ షాకి అలవాటుగా మారిందన్నారు. గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని చెప్పారు.