భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
పూర్వీకుల భూమి స్వాధీనం చేసునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్యకు, గూడెపు నర్సింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్‌కు మధ్య పూర్వీకుల కాలంనాటి భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా గూడెపు శంకరయ్య అదే భూమిపై తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ పొందాడు. భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో శంకరయ్యపై గూడెపు నర్సింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్ ద్వేషం పెంచుకున్నారు. శంకరయ్యను ఎలాగైనా హత్య చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నారు. నర్సింగరావు శంకరయ్యను హత్య చేసేందుకు ప్రశాంత్‌ని నియమించాడు. శంకరయ్య కదలికలను గమనించే పనిని కార్తీక్‌కు అప్పగించాడు. శంకరయ్యను హత్య చేసేందుకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఈనెల రెండో తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కల్వకోల్ ఎక్స్ రోడ్ దగ్గర తన బైక్‌పై వస్తున్న శంకరయ్యను ప్రశాంత్ కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అనంతరం శంకరయ్యను హత్య చేసిన విషయాన్ని వాట్సప్ ద్వారా నర్సింగరావుకు తెలియజేశాడు. అయితే ముందుగా శంకరయ్య యాక్సిడెంట్‌లో చనిపోయాడని భావించిన పోలీసులకు.. ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజీ, ఆధారాలను సేకరించి విచారణ చేయడంతో.. ఇది యాక్సిడెంట్ కాదని కావాలనే శంకరయ్యను హత్య చేశారని తేల్చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. వారి నుంచి 2 కార్లు, మోటార్ సైకిల్‌తోపాటు 3 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు.