మస్క్ ను మెచ్చుకున్న పుతిన్..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో సోవియట్ కాలం నాటి రాకెట్ శాస్త్రవేత్త సెర్గీకొరొలోవ్ తో ఆయన్ను పోల్చారు. మాస్కోలోని బౌమన్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మస్క్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు తెలుసా.. అమెరికాలో మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అంగారక గ్రహం గురించిన కలలను గొప్పగా చెబుతుంటాడు. మానవ జాతిలో ఇలాంటి వారు చాలా అరుదు. అతడి కలలు కొంతకాలం తర్వాత వాస్తవరూపం ధరిస్తాయని పుతిన్ అన్నారు.
అంతేకాకుండా ఆయన గురించి మాట్లాడుతూ.. మస్క్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రోజున నాకు నమ్మశక్యం కానివి భవిష్యత్తులో నిజాలు అవుతాయి. అంతకుముందు జర్నలిస్ట్ టకర్ కార్ల్‌సన్ తో కూడా మాట్లాడుతూ ఎలాన్ మస్క్‌కు ఎదురులేదు అని పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2023 ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో పుతిన్ మాట్లాడుతూ ఎలాన్ ఓ అసాధారణ వ్యక్తి.. ప్రతిభావంతుడైన వ్యాపారవేత్త. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది అని పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.