షూటింగ్ వరల్డ్ కప్ లో సురుచి..
తాజాగా బ్యూనస్ ఎయిర్స్ షూటింగ్ ప్రపంచకప్ స్టేజ్ 1 టోర్నీలో స్వర్ణం, కాంస్యంతో వెలుగులోకి వచ్చిన టీనేజర్ సురుచి.. లిమాలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో పసిడి గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో పసిడిని దక్కించుకున్న ఆమె.. ఇదే ఈవెంట్లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సౌరభ్ చౌదరితో కలిసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 24 షాట్ల తుది పోరులో సురుచి 1.3 పాయింట్లతో ఫేవరెట్ మను బాకర్ పై విజయం సాధించింది.
చివరి రెండు షాట్ల వరకు బాకర్ నుంచి సురుచికి గట్టిపోటీని ఎదుర్కొంది. కానీ ఒత్తిడిని అధిగమించిన ఈ టీనేజర్ స్వర్ణాన్ని దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మను రజతంతో సరిపెట్టుకుంది. యావో కియాన్‌యున్ కాంస్యం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో సురుచి, సౌరభ్ పెయిర్ 17-9తో కియాన్‌గ్జున్, హుకయ్ ద్వయాన్ని ఓడించింది. ఒక దశలో 2-8తో వెనుకబడినా.. భారత జంట పుంజుకుని విజేతగా నిలవడం విశేషం.