ప్రతిపక్షాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారం దక్కాలి అనే నెపంతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని అన్నారు.కానీ తమ పార్టీ అలాంటి వాటికి తావు ఇవ్వకుండా దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఫులే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని అక్కడి వారినుద్దేశించి ప్రసంగించారు.
మోదీ ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కూడా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్ వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని ప్రధాని వివరించారు. గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండేవని, కానీ నేడు కాశీ పూర్వాంచల్‌కు ఆరోగ్య రాజధానిగా మారుతోందని ప్రధాని అన్నారు. ఇక తన సొంత నియోజకవర్గమైన వారణాసీ ఎప్పటికీ తనదేనని.. తాను కాశీకి చెందినవాడినని మోదీ పేర్కొన్నారు.