స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో ఓ యువకుడిని స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. యాప్రాల్‌కు చెందిన ప్రణీత్‌పై అతడి స్నేహితులైన గోవర్ధన్, జశ్వంత్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్ గంజాయి విక్రయించడంతోపాటు తమ పేర్లను వాడుకుంటున్నాడని గోవర్ధన్, జశ్వంత్ అతడిపై పగ పెంచుకున్నారు. వీళ్ల పోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రణీత్‌కు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మరో స్నేహితుడు విన్సెంట్ ఫోన్ ద్వారా కాల్ చేసి ప్రణీత్‌ను పిలిపించారు. యాప్రాల్ వాటర్ ట్యాంక్ వెనుక వైపు మైదానానికి తీసుకువెళ్లి.. దాదాపు గంట పాటు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం బాధితుడి సోదరుడికి ఫోన్ చేసి రోడ్డు యాక్సిడెంట్‌లో ప్రణీత్‌కు గాయాలయ్యాయని చెప్పారు.అప్పటికే అతడి తలకు బలమైన గాయాలు కావడంతోపాటు, పక్కటెముకలు విరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు చేతులెత్తయడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు.