ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే నవంబర్ 11న నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పరివర్తన రాజనీతి పార్టీ (Parivarthan Rajaneethi Party) పేరుతో ఈ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని చేపట్టిన ఆయన.. ఉదయం 11 గంటల 11 నిమిషాల శుభ ముహూర్తాన తమ పరివర్తన రాజనీతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగుల మేళవింపుతో మధ్యలో ధర్మచక్రం గుర్తుతో రూపొందించిన ఈ పార్టీ జెండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పార్టీ ఆవిర్భావ వేదికపై మాట్లాడిన విజయసాయిరెడ్డి ..ఏపీలో దశాబ్దాలుగా సాగుతున్న వారసత్వ పాలిటిక్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఎన్నో ఏళ్లుగా కేవలం రెండే రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కొడుకే సీఎం కావాలా? ప్రతిపక్ష నేత కొడుకే మళ్లీ ఆ సీటులో కూర్చోవాలా అని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబు, జగన్ తప్పులు చేస్తే వారిని నిలదీసే ధైర్యం ప్రజలందరిలోనూ రావాలని పిలుపునిచ్చారు. తాము ఏ రాజకీయాధిపత్యానికీ బీ-టీమ్ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే స్వతంత్రంగా కొత్త పార్టీని పెట్టామని తేల్చిచెప్పారు.
ఈ పరివర్తన రాజనీతి పార్టీ(Parivarthan Rajaneethi Party) ప్రధాన ఎజెండా యువతకు పెద్దపీట వేయడమేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఏకంగా 66 శాతం అవకాశాలు, పదవులు యూత్‌కే కేటాయిస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. తాను మళ్లీ నాయకుడిగా ఎదగడానికి పార్టీ పెట్టలేదని, ఏపీకి కావలసిన సరికొత్త నాయకులను తయారు చేయడమే తన టార్గెట్ అని వెల్లడించారు. 2029లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని, ఏపీలో రాజ్యమేలుతున్న దుష్టపాలనకు చరమగీతం పాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
