ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల సమయంలో.. దైవభక్తితో పాటు అధికారుల హంగూ ఆర్భాటాలు కూడా పీక్స్కి చేరాయనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 16వ తేదీన మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు విజయవాడకు తరలివచ్చారు. అయితే అందరికీ నిత్యం సేవలు అందిస్తున్న దేవస్థానం సిబ్బందిపై ఒక మున్సిపల్ అధికారి పెత్తనం ప్రదర్శించారన్న వార్తలు వినిపస్తున్నాయి. భక్తుల రద్దీని తట్టుకుంటూ అన్నదానం నిర్వహిస్తున్న సిబ్బందిపై వారి చెత్త తొలగింపును ఆపేస్తానంటూ బెదిరింపులు దిగారన్న ప్రచారం జరుగుతోంది.
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బందితో పాటు భక్తుల కోసం బ్రాహ్మణ వీధిలోని సత్రంలో దేవస్థానం స్పెషల్గా అన్నదాన ఏర్పాట్లు చేసింది. అయితే ఈ అన్నదాన కేంద్రం వద్ద బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రవర్తించిన తీరుపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అన్నదాన సత్రం వద్ద సిబ్బంది ఫుల్ బిజీగా ఉన్న సమయంలో సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ తన సొంత కమ్యూనిటీకి చెందిన సుమారు 30 మంది బంధువులను వెంటబెట్టుకుని వచ్చి, వారందరికీ వెంటనే భోజనం ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిస్తున్నాయి.
భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని, కాస్త టైమ్ పడుతుందని అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దేవస్థానం సిబ్బంది చెప్పడంతో.. తీవ్ర అసహనానికి గురై, తన అధికార దర్పాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. తాను శానిటరీ ఇన్స్పెక్టర్నని, తన మాట వినకపోతే ఇక్కడి నుంచి ఒక్క చెత్త బుట్టను కూడా బయటకు వెళ్లనివ్వనంటూ బెదిరించినట్లు సమాచారం. అలాగే పారిశుద్ధ్య కార్మికులను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతానని..అవసరమైతే అన్నదాన కార్యక్రమాన్నే నిలిపేస్తాననే ధోరణిలో హెచ్చరించినట్లుగా ప్రచారం సాగుతోంది.
కీలకమైన హోదాలో ఉండి, ప్రజాసేవ చేయాల్సిన అధికారి తన స్వార్థం కోసం, బంధువుల కోసం బెదిరింపులకు దిగడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అందుకే అన్నదాన కేంద్రం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఆ టైమ్లో విధుల్లో ఉన్న దేవస్థానం సిబ్బంది వాంగ్మూలాలను సేకరించి, ఆరోపణలు కనుక రుజువైతే ఆ శానిటరీ ఇన్స్పెక్టర్పై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
