వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ జగన్ప నమోదైన కేసులో తర్వాత తీసుకోబోయే చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సమయంలో పులివెందులలో ఓటు వేయడానికి వెళ్లిన వైఎస్ జగన్, పోలింగ్ కేంద్రాల్లోకి వైసీపీ ఏజెంట్లను పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కొంతమంది అనుచరులతో కలసి పులివెందుల మున్సిపల్ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాను చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగానే ఎటువంటి అనుమతి లేకుండా అలా నిరసన తెలపడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ ఎంఈవో రఫిక్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను వినిపిస్తూ.. దర్యాప్తు ప్రిలిమినరీ స్టేజ్‌లో ఉందని, ఇప్పటికే 13 మంది సాక్షులను కూడా విచారించామని తెలిపారు. అనుమతి లేకుండా ధర్నా చేసి కోడ్ ఉల్లంఘించడంతో.. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణపై దాని ప్రభావం పడుతుందని వివరించారు.
అయితే ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు..వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారుడైన ఎంఈవో రఫిక్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో పాటు, పూర్తి వివరాలతో కౌంటర్‌ను దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
