ఏపీ పాలిటిక్స్‌లో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కేవలం 11 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీకి, ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కలిసొస్తాయనుకుంటే అవి మరింత గట్టి దెబ్బ కొడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన కడప జిల్లాతో పాటు పులివెందులలో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది.
ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి తిరుగులేని కోటగా పేరుబడ్డ పులివెందుల మున్సిపాలిటీలో.. తెలుగు దేశం పార్టీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ఉన్న మొత్తం 40 మున్సిపల్ వార్డుల్లో ఏకంగా 20 స్థానాలను ఏకగ్రీవంగా తన అకౌంట్లో వేసుకుని వైసీపీ నేతలను అవాక్కయ్యేలా చేసింది. మిగిలిన 20 వార్డులతో పాటు చైర్పర్సన్ పీఠానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఈ ఏకగ్రీవాల సరళి అక్కడి పొలిటికల్ ఈక్వేషన్స్‌ను పూర్తిగా మార్చేసింది.
ఇక్కడ మాత్రమే కాదు.. ఉమ్మడి కడప జిల్లాలోని 9 మున్సిపల్ చైర్మన్/మేయర్ స్థానాలలో 6 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోవడం హాట్ టాపిక్ అయింది. కడప కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో టీడీపీ 47, బీజేపీ 2, జనసేన 1 డివిజన్‌ను కైవసం చేసుకోగా, ఇక మేయర్ స్థానంతో పాటు మరో 16 చోట్ల మాత్రమే పోలింగ్ జరగబోతోంది. ప్రొద్దుటూరులో మొత్తం 52 వార్డుల్లో 51 చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. బద్వేలులో 40కిగానూ టీడీపీ 35, జనసేన 2 స్థానాలు సాధించగా, మైదుకూరులో 32 వార్డుల్లో 17 స్థానాలు టీడీపీ అకౌంట్లోకి వచ్చేశాయి.
అలాగే రాజంపేట, కమలాపురం, ఎర్రగుంట్ల నగర పంచాయతీలలో కూడ మెజారిటీ వార్డులను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఒకప్పుడు వైసీపీకి కంచు కోటగా ఉన్న కడప జిల్లాలో కూటమి కనబరిచిన ఈ ఏకపక్ష దూకుడు ఇప్పుడు వైసీపీ శ్రేణులను ఆందోళనలోకి నెట్టేసింది.
