ఏపీలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ సమరానికి కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఘనవిజయమే మెయిన్ టార్గెట్‌గా ప్రణాళికలు రచిస్తున్న టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, మెయిన్ లీడర్స్‌తో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి.. చెప్పాం-చేస్తున్నాం అనే నినాదంతో గడపగడపకూ తీసుకెళ్లాలని బాబు పిలుపునిచ్చారు.
2024 ఎలక్షన్స్‌లో ప్రజలు ఇచ్చిన హిస్టారికల్ తీర్పుతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు. గడిచిన పాలనలోని అరాచకాలను విసిగివేసారిన ప్రజలంతా ఆ ఎన్నికలలో ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమాన్ని పరుగులు తీస్తున్నామని, ఈ మంచి పనులను ప్రతీ ఓటరుకు వివరించాల్సిన బాధ్యత ప్రతీ నాయకుడిపైన ఉందన్నారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కూడా కూటమి కట్టుబాటును గట్టిగా పాటించాలని సీఎం క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి ఒకే తాటిపై నిలబడి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మిత్రధర్మాన్ని కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యానికి చోటే లేదని.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో ఒకేలాంటి పాలన ఉంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందే విషయాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకుని వెళ్లాలని నేతలకు వివరించారు.
స్థానిక పోరులో పొత్తులతో పాటు సామాజిక ఈక్వేషన్స్ వల్ల కొందరికి అవకాశాలు రాకపోవచ్చని అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని రికార్డ్ చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో సీట్లు దక్కని అర్హులైన నాయకులకు నామినేటెడ్ పదవులతో తగిన ప్రాధాన్యం ఇస్తామని వారికి బాబు భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాకుండా.. ప్రతి పోలింగ్ బూత్‌లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యేలా పార్టీ శ్రేణులు కష్టపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
