ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నబ్’ తుపాను భయం గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో తీవ్రరూపం దాలుస్తున్న ఈ భీకర తుపాను ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే టార్గెట్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. తన క్యాంపు ఆఫీసు నుంచి అధికారులతో గంట గంటకూ వర్చువల్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు.
భారత వాతావరణ శాఖ (IMD) చెప్పిన సమాచారం ప్రకారం.. అర్నబ్ తుపాను రాబోయే 24 గంటల్లో మరిన్ని రెట్లు బలపడి, ఈ నెల 28వ తేదీన బాపట్ల , విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముంపు భయం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు , చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
దీనిలో భాగంగానే ప్రయారిటీని బట్టి 4,711 మంది గర్భిణులను ముందస్తుగా దగ్గర్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు. ఎమర్జెన్సీ సహాయక చర్యల కోసం 11 ప్రభావిత జిల్లాల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను సిద్ధంగా ఉంచగా, కోస్ట్ గార్డ్, నేవీ సేవలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కోత కోసిన ధాన్యాన్ని భద్రపరచడంలో వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో వారికి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తుపాను గమనాన్ని బట్టి ప్రతీ 4 గంటలకు ఒకసారి అధికారిక హెచ్చరిక బులెటిన్లను విడుదల చేయాలని అలాగే సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరిస్థితిని బట్టి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ప్రకటించే పూర్తి అధికారాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.
