దేశవ్యాప్తంగా నమ్మకం, ప్యూరిటీ, నాణ్యత అంటూ భారీ యాడ్స్‌తో కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకునే పెద్ద బ్రాండ్ల నిజస్వరూపం తాజాగా బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు జ్యువెలరీ షోరూంలలో సంచలనం సృష్టిస్తోంది. పెద్ద బ్రాండ్లనే గుడ్డిగా నమ్మి మోసపోతున్నామా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.
బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి వెళ్లిన ఒక వ్యక్తి, తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ బ్రాస్లెట్ను ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్తగా జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాడు. అక్కడి సిబ్బంది దాన్ని XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో పెట్టి టెస్ట్ చేసి అది కూడా ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేసి కూడా అది కేవలం 20 క్యారెట్ మాత్రమేనని చెప్పారు. అంతేకాదు ఆ బ్రాస్‌లెట్‌పై హాల్మార్కే లేదని వాదించారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమర్ ఆ బ్రాస్లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌ను అక్కడికి పిలిపించాడు.
ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నెబర్ను నిర్ధారించి, తమ ముందే మళ్లీ పరీక్షించాలని పట్టుబట్టడంతో.. అక్కడి ఉద్యోగి మెషీన్లో ఏదో చిన్న సెట్టింగ్ మార్చి చెక్ చేశాడు. అంతే క్షణాల వ్యవధిలోనే రీడింగ్ మొత్తం చేంజ్ అయిపోయి ఏకంగా 916 ప్యూర్ 22 క్యారెట్‌గా తేలింది. ఒకే గోల్డ్‌కు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో 2 వేర్వేరు రీడింగులు రావడం, అది కూడా వేరే వ్యక్తి నిలబడి నిలదీయగానే వ్యాల్యూ మారిపోవడం కస్టమర్ షాక్ అయ్యాడు.
ఈ తతంగాన్ని లోకల్ జ్యువెలర్ వీడియో రికార్డ్ చేయడంతో ఈ లోగుట్టు బట్టబయలైంది. వెంటనే జువెలర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో, షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆ అనుమానాస్పద టెస్టింగ్ మెషీన్‌తో పాటు సీసీటీవీ డీవీఆర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లు తాము కట్టే బిల్లుపై ఉన్న స్వచ్ఛతను నమ్మి వెళ్తే, ఇలా టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వేల రూపాయల విలువైన బంగారాన్ని తగ్గించి చూపించడం మోసమని ప్రజలు మండిపడుతున్నారు.
