ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డెవలప్మెంట్ పనులు వేగంగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక వైఎస్సార్సీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ అలజడులు సృష్టిస్తూ అబద్ధపు ప్రచారాలకు తెగబడుతోందని వారు విమర్శించారు.
ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ తన కార్యకర్తలతో అలజడులు, గొడవలు సృష్టించి, తాను మాత్రం హాయిగా బెంగళూరు వెళ్లి కూర్చోవడం జగన్‌కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
గతంలో తాను తీవ్రవాదులకు కూడా ఇలాగే హెచ్చరికలు చేశానని గుర్తుచేసిన చంద్రబాబు.. హింసను విడనాడి ప్రజాస్వామ్యంలోకి రావాలని పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు జనశక్తి మహిళా నాయకురాలైన సీతక్కను తానే ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చానని, ఇప్పుడామె తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మారి ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ఉదాహరణగా చెప్పారు.
కూటమి సిద్ధాంతం ఎప్పుడూ కూడా సంక్షేమం, డెవలప్మెంట్, మంచి పరిపాలన, ప్రజలకు సేవ చేయడమేనని.. కానీ, వైఎస్సార్సీపీ సిద్ధాంతం మాత్రం కేవలం క్రిమినలైజేషన్, వేస్ట్ కోర్టు లిటిగేషన్లు, వ్యవస్థల విధ్వంసం, ఫేక్ ప్రాపగండా చేసుకోవడమేనని అన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులు తమ హింసాత్మక పాలిటిక్స్‌ను పూర్తిగా పక్కనబెట్టి, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగాలని చంద్రబాబు కోరారు.
