ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలువడిన విడాకుల నిర్ణయం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఇకపై తాము మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన పేరెంట్స్‌గా మాత్రమే కొనసాగుతామని క్లియర్‌గా చెబుతూ, తమ వ్యక్తిగత గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో కొంతమంది చేసే విపరీతమైన చర్చలు, ట్రోల్స్‌ను గమనించిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
రాజకీయంగా ఎలాంటి స్నేహం ఉన్నా, విభేదాలు ఉన్నా కూడా ఏ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని వివాదాలకు వేదికగా మార్చకూడనే ఉద్దేశంతో టీడీపీ, వైసీపీలు తమ సోషల్ మీడియా విభాగాలు ,శ్రేణులకు కఠినమైన గైడెన్స్‌ను జారీ చేశాయి.
టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ ఈ అంశంపై క్లియర్ ఆదేశాలు ఇస్తూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై ఎవరూ ఎలాంటి పోస్టులు కానీ, విమర్శలు కానీ చేయొద్దని స్పష్టం చేసింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించి ఎవరైనా వ్యక్తిగత కామెంట్లు చేస్తే, వారి చర్యలకు పార్టీ బాధ్యత వహించదని, కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు వైసీపీ కూడా తన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కేడర్‌కు ఇదే రకమైన కఠిన ఆదేశాలను జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టడం అలాగే కామెంట్లు చేయడంతో పాటు ఇతరులు షేర్ చేసిన కంటెంట్‌ను ప్రచారం చేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఎవరి పర్సనల్ గోప్యతను వారు కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేసింది.
సాధారణంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించుకునే ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, వైసీపీలు.. ఒక పవన్ విడాకులకు సంబంధించిన సెన్సిటివ్ వ్యక్తిగత అంశం వచ్చేసరికి ఒకే రకమైన సంయమన వైఖరిని ప్రదర్శించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
