ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో దశాబ్దాలుగా ఎప్పటికీ వీడని కొన్ని రహస్యాలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా 2004 సంవత్సరంలో యూపీఏ కూటమి ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత, దేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ముందు ఉన్నా కూడా.. ఆమె ఎందుకు ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారనే దానిపై ఎమోషనల్ నిజాలను బయటపెట్టారు.
ఎన్నికలకు ముందుగానే తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాతో ప్రధాని పదవి విషయంపై చర్చించానని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దారుణ హత్యలను కళ్లారా చూసిన ఆ పిల్లలకు ప్రధాని పదవి అంటే ప్రాణాలకు ముప్పు అని అన్పించేంత భయం ఉండేదని సోనియా గాంధీ(Sonia Gandhi) గుర్తు చేసుకున్నారు. పార్టీ యూనిటీని కాపాడుకోవాలని,అలాగే లీడర్షిప్ కోసం ఎలాంటి పోరు రాకూడదని భావించానని తెలిపారు.
గత ప్రభుత్వాల వారసత్వాన్నిదేశంలో ముందుకు తీసుకువెళ్లడానికి పరిపాలనలో అపారమైన అనుభవం, నిజాయతీ ఉన్న వ్యక్తి అవసరమని భావించినట్లు సోనియా బుక్లో వివరించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు పదేపదే ఒత్తిడి తెచ్చినా.. తన విదేశీ మూలాలను అడ్డంపెట్టుకుని ప్రత్యర్థులు దేశంలో ఉద్రిక్తతలు సృష్టించానికి అవకాశం ఉందని ఆలోచించి ప్రధాని పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. చివరికి అందరి ఆమోదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించి అందరికీ షాకిచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఇదే పుస్తకంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన సంబంధాల గురించి కూడా సోనియా కొన్ని విషయాలు పంచుకున్నారు. మోదీ ప్రధానిగా పన్నెండేళ్లకు పైగా కొనసాగుతున్నా కూడా, ఆయనతో తనకు పర్సనల్గా ఎప్పుడూ పెద్దగా పరిచయం ఏర్పడలేదని తెలిపారు.
పార్లమెంట్లో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకోవడం తప్ప వేరే సంభాషణలు ఏరోజూ జరగలేదని సోనియా గాంధీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ తనకు ఎదురుపడినప్పుడు కళ్లలోకి అసలు చూడకుండా మరోవైపు చూస్తారన్న విషయాన్ని ఆమె హైలైట్ చేస్తూ తెలిపారు.
గతంలో విభిన్న పార్టీల నాయకుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేదని, కానీ ప్రస్తుత పొలిటికల్ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సోనియా అభిప్రాయపడ్డారు. అధికారిక పలకరింపులు తప్ప పెద్దగా మాట్లాడుకోకపోయినా, పుట్టినరోజులు , నూతన సంవత్సర వేళల్లో మాత్రం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్లమని అన్నారు. తాను అనారోగ్యం నుంచి కోలుకుని వచ్చిన సమయంలో మాత్రం మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేవారని సోనియా ఈ బిలాంగింగ్ పుస్తకంలో వివరించారు.
