ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నయా బెదిరింపు పాలిటిక్స్‌కు తెరలేపడంపై కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. మళ్లీ తమ హవా స్టార్ట్ అయితే ‘2.O’ పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని వైసీపీ నేతలు చేస్తున్న హెచ్చరికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఎవరు ఏ స్థాయి బెదిరింపులకు దిగినా తమ కూటమి ప్రభుత్వం దానికి 10X అంటే పదింతల రేంజ్లో తిప్పికొడుతుందని పవన్ తేల్చిచెప్పారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర సారథి పీవీఎన్ మాధవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేశారు.
గతంలో వైసీపీ 1.O వెర్షన్ హయాంలో జరిగిన భయాందోళనలను, హింసాత్మక రాజకీయాన్ని క్షేత్రస్థాయిలో గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న హిస్టరీ తమకు ఉందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా తట్టుకుని, ప్రజల పక్షాన నిలబడి రక్షణగా ఉండే పక్కా ప్లాన్ తమ వద్ద ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మాట్లాడే మాటల్లో లౌక్యం, పద్ధతి ఉండాలని, ప్రతి చిన్న విషయానికీ పదే పదే హెచ్చరికలు జారీ చేయడం మంచిది కాదని క్లాస్ పీకారు.
అదే ప్రెస్‌మీట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విపక్షం వైఖరిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర ధోరణి వల్ల రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయిందని, ఆ చేదు జ్ఞాపకాలను ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదని అన్నారు.
ఇప్పుడు మళ్లీ అదే భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. తాము చట్టబద్ధమైన, పారదర్శకమైన మంచి పాలనను అందిస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతాన్ని కలిగిస్తూ చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు.
