బంగాళాఖాతంలో బలపడిన అర్నబ్ తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ఎఫెక్ట్.. ఉత్తర కోస్తాపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో సముద్రమంతా అల్లకల్లోలంగా మారనుంది. అలాగే కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి,కాకినాడ, ఏలూరు, జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ నుంచి కుంభృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 115 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ తుపాను యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఒకవేళ దిశ మారితే మాత్రం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు తుపాన్ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అలాగే ఇతర సహాయక చర్యల కోసం 20 జిల్లాల కలెక్టర్లకు రూ.27 కోట్లు చేసినట్లు రిలీజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పాటు అన్ని రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తుపాను హెచ్చరికల వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ట్రాక్‌లు దెబ్బతినకుండా దక్షిణ కోస్తా రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టి, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించే సుమారు 53 రైళ్లను రద్దు చేసింది. విశాఖ – కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొన్ని ఇంటర్సిటీ, పాసింజర్ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ట్రైన్ స్టేటస్‌ను ముందే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
