గణపతి నవరాత్రుల సందర్భంగా గండిపేట MRO కార్యాలయం సమీపంలో ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాలకృష్ణ యాదవ్, గణేష్ యాదవ్, రాహుల్ యాదవ్ మరియు వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో వేడుకలు కొనసాగాయి. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గండిపేట MRO కార్యాలయం పరిసర ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారి లడ్డూ వేలంపాటను నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంలో శ్రీ శంకర్ యాదవ్ రూ.3,60,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న శంకర్ యాదవ్‌కు నిర్వాహకులు, భక్తులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వినాయక స్వామివారి లడ్డూను దక్కించుకోవడం తమకు ఆనందంగా ఉందని శంకర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు శంకర్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు, భక్తులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిశాయి.
