దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పెషల్గా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీనిపై ఇద్దరు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకొంటామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం వెలిగించే దీపం మన ఇంటికి మాత్రమే కాదని, సమాజానికీ వెలుగునివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబంలో సుఖశాంతులతో పాటు సిరిసంపదలు వెల్లి విరియాలని అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని సీఎం కోరుకున్నారు. ఐకమత్యం, పరస్పర సహకారంతో అందరూ ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రజలకు దీపావళి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, బతుకుల్లో కొత్త వెలుగులను నింపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తమ సర్కార్ నిత్యం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. అయితే, పండుగ సంబరాల సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే, కాలుష్యానికి కూడా చోటు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చిన్నారులు, పెద్దలు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
