కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన లైఫ్‌ను బేస్ చేసుకుని రాసిన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఆధారంగా తెలుగులో ఓ ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు.
సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జగ్గారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఇందిరా గాంధీ కోడలిగానే కాకుండా.. రాజీవ్ గాంధీ భార్యగా అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తల్లిగా సోనియా సాగించిన పర్సనల్ లైఫ్ జర్నీతో పాటు ఎదుర్కొన్న ఎన్నో రాజకీయ సవాళ్లను ఈ సోనియా బయోపిక్(Sonia Gandhi Biopic ) ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
ఇండియన్ పాలిటిక్స్‌లో సోనియా గాంధీ వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని, ఆమెది అత్యంత విజయవంతమైన, త్యాగపూరితమైన పొలిటికల్ జీవితమని జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధానమంత్రి అయ్యే గొప్ప అవకాశం వచ్చినా కూడా ఆమె పదవిపై ఎలాంటి వ్యామోహం చూపించలేదని గుర్తుచేశారు.
సోనియమ్మ భర్త రాజీవ్ గాంధీ అకాల మరణం తర్వాత తాను త్యాగం చేసి.. పీవీ నరసింహారావును, ఆ తర్వాత యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపైన కూర్చోబెట్టిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని జగ్గారెడ్డి వివరించారు. ఈ చారిత్రక ఘట్టాలన్నింటినీ కూడా తాము తీయబోయే సోనియా బయోపిక్(Sonia Gandhi Biopic )లో పొందుపరచనున్నట్లు చెప్పారు.
ఈ ప్రతిష్ఠాత్మక మూవీ నిర్మాణానికి కావలసిన నిధులను సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా స్వచ్ఛందంగా సమకూరుస్తారని, వారే ఈ మూవీ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగానూ వ్యవహరిస్తారని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిర్మాణ పర్యవేక్షణ కోసం స్పెషల్‌గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా తామ తీయబోయే సోనియా గాంధీ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.ఇలా జగ్గారెడ్డి చేసిన మూవీ ప్రకటనతో తెలంగాణ పొలిటికల్ వర్గాలతో పాటు టాలీవుడ్లో కూడా ఆసక్తి నెలకొంది.
