ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ పోరుకు మళ్లీ తెరలేచింది. సుదీర్ఘకాలంగా వివిధ న్యాయపరమైన వివాదాలు, కోర్టు స్టేల వల్ల పెండింగ్లో పడిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల(Urban Local Body Elections)ను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సమాయత్తమవుతోంది.
కోర్టు సమస్యలు తొలగిపోవడంతో ఏపీలోని 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించడానికి కసరత్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 26వ తేదీన ఓటింగ్ నిర్వహించాలని ప్రాథమికంగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నవంబర్ 13వ తేదీన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మున్సిపల్ ఎన్నికల (Municipal elections) పోరులో ఏపీలోని కొన్ని కీలక నగరాలు, ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలకు (Corporations) ఎన్నికలు జరగనున్నాయి.
వీటితో పాటు ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట వంటి పురపాలక సంఘాల్లోనూ అదే రోజు పోలింగ్ జరపనున్నారు. తొలి విడత పంచాయతీ ఎలక్షన్ జరిగే నవంబర్ 26వ తేదీన వీటిని పూర్తి చేయాలని కూటమి గవర్నమెంట్ భావిస్తోంది.
మున్సిపల్ ఎలక్షన్(Municipal Elections) ప్రాసెస్కు సంబంధించి ఓటర్ల ఫైనల్ లిస్ట్ తయారీ, వార్డుల పునర్విభజన, క్షేత్రస్థాయి పరిశీలన వంటి బేసిక్ పనులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎలక్షన్ నిర్వహణపై నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యమని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఏపీలోని ప్రధాన పొలిటికల్ పక్షాలైన కూటమి పార్టీలు, వైసీపీ మున్సిపల్ పోరుకు కేండిడేట్స్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడగానే ఏపీ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రాబోతోంది.
