జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో ఈ ఆత్మీయ భేటీ జరిగింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను వారు గుర్తుచేసుకున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ పరిణామాలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం వ్యక్తిగత స్నేహపూర్వక భేటీగా సాగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
