ఏపీలో ఇటీవల ముగిసిన లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి సాధించిన ఘన విజయంపై రెండు వర్గాల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకూ ముదురుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఫుల్‌గా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఏకంగా.. రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అనే హ్యాష్‌ట్యాగ్‌తో జగన్ చేసిన పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదంటూ వైఎస్ జగన్(YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అచ్చం గొర్రెతోలు కప్పుకున్న తోడేలులాగే చంద్రబాబు వ్యవహారం ఉందంటూ తీవ్ర పదజాలాన్ని వాడుతూ విమర్శలు గుప్పించారు. గడచిన ఎలక్షన్ టైమ్‌లో ప్రజాస్వామ్య సూత్రాలతో పాటు చట్టాలను కూడా అపహాస్యం చేసిన రిగ్గింగ్ మాస్టర్ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్దగా నీతులు వల్లించడం చూసి ఏపీ ప్రజలంతా నివ్వెరపోతున్నారని ఆయన సెటైర్ వేశారు.
ఎన్నికల్లో తెరవెనుక భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ పరోక్షంగా తీవ్రమైన ఆరోపణలను గుప్పిస్తూ, తన పోస్ట్ చివర్లో హే రామ్ సేవ్ ఆంధ్రా అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏకపక్ష ఫలితాలు రావడంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఈ విజయం ప్రజలు తమ కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఇచ్చిన నిజమైన కానుక అంటూ ఆయా పార్టీల నేతలు గట్టిగా వాదిస్తున్నారు.
ఎన్నికల ప్రాసెస్‌లో తమది ఎలాంటి జోక్యం లేదని, ప్రజలంతా కలిసి స్వచ్ఛందంగా కూటమి వైపే నిలబడ్డారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమయంలో జగన్ చేసిన ఈ తాజా ట్వీట్ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రతిపక్ష నేత చేసిన ఈ విమర్శలపై టీడీపీతో పాటు కూటమిలోని ఇతర ప్రధాన నేతలు ఎలా కౌంటర్ ఇస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల రగడ ఇంకా చల్లారకముందే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ మాటల యుద్ధం రానున్న రోజుల్లో రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్తుందో వేచి చూడాలి.
