ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి సాధించిన వరుస గెలుపుల చారిత్రక విజయమే హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అంచనాలను తలకిందులను చేస్తూ తిరుగులేని ప్రభంజనానని సృష్టించింది. ఈ భారీ విజయంపై ఈరోజు స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ..ఏపీ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.
మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారి తీస్తుంది అనే తను బలంగా నమ్మిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రజలు మరోసారి నిజం చేశారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సాధారణ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ప్రజల నుంచి కూటమికి లభించిన ఆదరణ మరింతగా పెరిగిందని, వైసీపీని మాత్రం ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాలు, గ్రామాలునే తేడా ఏమాత్రం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూటమి వైపు నిలబడ్డారని తెలిపారు.
ఈవీఎంల మోత మోగినా సరే, బ్యాలెట్ పేపర్లు తిప్పినా సరే తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా వచ్చిందని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమగోదావరి, వంటి కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో అయితే వైసీపీ ఉనికి కోల్పోయిందని అన్నారు. వరుస తుపాన్లు, విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పని చేసిందని, ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించే ఇప్పుడు ఈ ఘన విజయాన్ని కట్టబెట్టారని చంద్రబాబు భావోద్వేగంతో తన మనసులో మాటలు పంచుకున్నారు.
ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించడం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఇకపై మరింత అంకితభావంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని సీఎం తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మించిన నిరూపణ లేనే లేదని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మరోసారి రుజువు చేశాయని అన్నారు.
