యూపీఐ చెల్లింపులపై MDR విధించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా “No UPI Day” నిర్వహించాలని ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఆ రోజు దుకాణాలు, వ్యాపార సంస్థల్లో డిజిటల్ చెల్లింపులను స్వీకరించబోమని ప్రకటించాయి. నిరసనలో భాగంగా యూపీఐ స్కానర్లు, QR కోడ్లు, సౌండ్ బాక్సులను నల్లటి వస్త్రంతో కప్పనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ట్రేడర్స్, వ్యాపార సంఘాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు MH ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర వెల్లడించారు. యూపీఐ లావాదేవీలపై MDR విధించడం వల్ల వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 2న నిరసనలో పాల్గొనే వ్యాపార సంస్థలకు వెళ్లే వినియోగదారులు నగదు లేదా అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతులను ఉపయోగించాల్సి రావచ్చు. ఈ నిరసనకు సంబంధించిన మరిన్ని వివరాలను సంఘాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది
