ఆహారం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఎంపిక. ఒకరు శాఖాహారం ఇష్టపడితే మరొకరు మాంసాహారం తింటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు మాత్రం కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా.. మతం, సంప్రదాయం, సంస్కృతి, వ్యక్తిగత విశ్వాసాలతోనూ ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఆవు మాంసం విషయంలో దేశంలో తరచూ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా మేక మాంసం తినడం తప్పు కానప్పుడు ఆవు మాంసం తినడాన్ని ఎందుకు తప్పుగా చూస్తారనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీస్తోంది. ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధంపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మాంసం ఒక్కటే.. కానీ విశ్వాసాలు వేర్వేరు..
ఆధునిక సెక్యులర్ రచయిత్రి శోభాడే కామెంట్లపై జరుగుతున్న ఈ చర్చలో వినిపిస్తున్న ప్రధాన వాదన చాలా సరళంగా ఉంటుంది. మేక అయినా, ఆవు అయినా రెండూ జంతువులే. వాటి మాంసం కూడా మాంసమే. అలాంటప్పుడు ఒక జంతువు మాంసాన్ని తినడం అంగీకరించి, మరో జంతువు మాంసాన్ని తినడాన్ని వ్యతిరేకించడం ఎందుకనే ప్రశ్న ఎదురవుతోంది.
అయితే ఈ వాదనకు మరో కోణం కూడా ఉంది. సమాజం కొన్ని జంతువులను ఆహారంగా మాత్రమే చూడదు. వాటికి ప్రత్యేకమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యతను ఇస్తుంది. హిందూ సంప్రదాయంలో ఆవుకు పవిత్రమైన స్థానం ఉంది. పాలు ఇవ్వడం, వ్యవసాయానికి తోడ్పడటం వంటి ఉపయోగాలతో పాటు, తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక విశ్వాసాలు కూడా ఆ గౌరవానికి కారణమయ్యాయి. అందుకే చాలామంది హిందువులు ఆవును సాధారణ జంతువుగా కాకుండా తల్లితో సమానంగా భావిస్తుంటారు.
అయితే హిందువులందరి ఆహారపు అలవాట్లు, విశ్వాసాలు ఒకేలా ఉండవు. కొందరు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటే, మరికొందరు కొన్ని రకాల మాంసాన్ని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఒకరి ఆహారపు అలవాట్లను మొత్తం సమాజానికి ఆపాదించడం సరైనది కాదు.
పాలు అన్నీ ఒకటేనా? విశ్వాసాలకూ ప్రత్యేకత ఉంటుంది!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనల్లో పాల ఉదాహరణను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆవు లేదా గేదె పాలను సాధారణంగా ఆహారంగా తీసుకునే కుటుంబాలు.. కుక్క, పంది, కోతి వంటి జంతువుల పాలను అదే విధంగా ఉపయోగించగలవా అనే ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు.
నిజానికి ఒకే వర్గానికి చెందిన పదార్థాలన్నింటినీ మనుషులు ఒకే విధంగా చూడరు. వాటి వినియోగం, సంప్రదాయం, అందుబాటులో ఉండటం, పర్సనల్ ఇంట్రస్ట్ వంటి అనేక అంశాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అయితే పాలు, మాంసం రెండూ వేర్వేరు సందర్భాలు కాబట్టి ఈ ఉదాహరణను పూర్తిస్థాయి సైంటిఫిక్ అండ్ ఎథికల్ ఆన్సర్‌గా చూడలేం. ఇది ప్రధానంగా విశ్వాసాల మధ్య ఉండే తేడాను వివరించేందుకు ఉపయోగించే పోలిక మాత్రమే.
కుటుంబ బంధాలకు కూడా ఇదే సూత్రమా?
మరో ఆసక్తికరమైన పోలిక కుటుంబ సంబంధాలకు సంబంధించినది. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, భార్య, భర్త.. వీరంతా మనుషులే అయినా కూడా మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందరినీ ఒకే రకంగా చూడలేం. ఆ బంధాల వెనుక ప్రేమ, అనుబంధం, బాధ్యత, నమ్మకం ఉంటాయి.
అదేవిధంగా కొన్ని జంతువుల పట్ల కూడా సమాజాలు ప్రత్యేకమైన అనుబంధాన్ని, గౌరవాన్ని పెంచుకుంటాయి. ఒకరికి ఆవు పవిత్రమైనదైతే, మరొకరికి మరో జంతువు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు. ఈ భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల విశ్వాసాలను గౌరవించడం సామాజిక జీవనంలో ముఖ్యమైన అంశాలు.
పులిని కాపాడితే ప్రశంసలు.. ఆవును కాపాడితే వివాదమా?
శోభా డే కామెంట్లపై జరుగుతున్న ఈ చర్చలో మరో ప్రశ్న కూడా రచ్చ లేపుతోంది. పులులను రక్షించాలని కోరేవారిని వన్యప్రాణి ప్రేమికులుగా, కుక్కలను కాపాడాలని చెప్పేవారిని జంతు ప్రేమికులుగా చెప్పుకుంటాం. మరి ఆవులను రక్షించాలని కోరేవారి విషయంలో మాత్రం కొన్నిసార్లు ఎందుకు వివాదాలు తలెత్తుతున్నాయనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు.
నిజానికి ఏ జంతువునైనా రక్షించాలని కోరడం తప్పు కాదు. అదే సమయంలో ఆ పేరుతో ఇతరులపై దాడులు చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. జంతు సంరక్షణ అనేది మానవత్వంతో కూడిన అంశం కావాలి. అది విద్వేషాలకు లేదా హింసకు రీజన్ కాకూడదు.
విశ్వాసాలను గౌరవించాలి.. వ్యక్తిగత స్వేచ్ఛనూ గుర్తించాలి
భారతదేశం భిన్నమైన మతాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లు కలిగిన సమాజం. ఒకరి విశ్వాసం మరొకరికి భిన్నంగా ఉండొచ్చు. ఎవరికైనా ఆవు పవిత్రమైనదిగా అనిపిస్తే ఆ భావనను గౌరవించాలి. అదే సమయంలో ఇతరుల ఆహారపు అలవాట్ల విషయంలోనూ చట్టం, వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి అంశాలను గుర్తుంచుకోవాలి.
చివరిగా మాంసం విషయంలో జరిగే చర్చ కేవలం ఏ జంతువు మాంసం తినాలి? ఏది తినకూడదు? అనే ప్రశ్నతో ముగిసిపోదు. దాని వెనుక సంస్కృతి, సంప్రదాయం, మత విశ్వాసాలు, వ్యక్తిగత అభిరుచులు కూడా ఉంటాయి. మన అభిప్రాయమే సరైనదని భావించి ఎదుటివారి నమ్మకాలను అవమానించడం కంటే.. భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడం, పరస్పరం గౌరవించుకోవడమే సొసైటీకి అవసరం అన్న విషయాన్ని గుర్తించాలి.
