ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల సర్దుబాటు రోజురోజుకు రచ్చకెక్కుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు ఫలించకపోవడంతో, రెండోసారి జరిపిన చర్చల్లో కూడా ఒక క్లియర్ ఏకాభిప్రాయం కుదరలేదు.
స్టార్టింగ్‌లో 181 స్థానాలు డిమాండ్ చేసిన కాంగ్రెస్, కొంత వెనక్కి తగ్గి 130 స్థానాలతో కూడిన లిస్ట్‌ను ఎస్పీ లీడర్స్ ముందుంచింది. అయితే, కాంగ్రెస్ ప్రతిపాదనపై రియాక్ట్ అయిన ఎస్పీ, కేవలం 26 అసెంబ్లీ సీట్లను ఆఫర్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించినట్లు పార్టీ ప్రతినిధి రాజీవ్ రాయ్ వెల్లడించారు. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 2 సీట్లు, రెండో స్థానంలో నిలిచిన 4 స్థానాలతో పాటు మరో 20 నియోజకవర్గాలను దీనిలో చేర్చినట్లు తెలిపారు.
అయితే, ఎస్పీ ప్రతిపాదించిన 26 సీట్ల ఆఫర్‌పై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఎస్పీ తీరుపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ సీట్ల కోసం ఎవరి ముందూ అడుక్కోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. పొత్తు చర్చలు నడుస్తుండగానే ఎస్పీ ఏకపక్షంగా 5 స్థానాలకు కేండిడేట్స్ తొలి జాబితాను ప్రకటించడంపై ఇమ్రాన్ మసూద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అఖిలేష్ యాదవ్ సాయం కోసం ఎదురుచూసే బిచ్చగాళ్లం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎస్పీ ఫస్ట్ లిస్టులో ప్రకటించిన షామ్లీ, అమ్రోహా, లలిత్పూర్, సహారన్‌పూర్‌లోని బెహత్, సహారన్పూర్ రూరల్ స్థానాల్లో.. బెహత్, సహారన్పూర్ రూరల్ స్థానాలను కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఆశిస్తోంది. పొత్తు ధర్మాన్ని పక్కనబెట్టి కేండిడేట్స్‌ను ప్రకటించడంపై స్పందిస్తూ, ఎస్పీ పోరాటం బీజేపీకి వ్యతిరేకమా లేక కాంగ్రెస్‌కు వ్యతిరేకమా అనేది క్లారిటీ ఇవ్వాలని ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, అవసరమైన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేండిడేట్సే బరిలోకి దిగుతారని తేల్చి చెప్పారు.
కాగా ఈ పరిణామాలపై మాట్లాడిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో విజయావకాశాలే ప్రాతిపదికగా సీట్ల పంపకాలుంటాయని అన్నారు. ప్రస్తుతం గెలిచే అవకాశాలున్న 26 స్థానాలతో చర్చలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో పరస్పర అవగాహనతో పూర్తి సర్దుబాటు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
2017 ఎన్నికల్లో ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా.. కాంగ్రెస్ 7, ఎస్పీ 47 స్థానాల వరకే పరిమితమయ్యాయి. ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని వ్యూహాలు రచిస్తున్న సమయంలో, ప్రారంభంలోనే ఈ విభేదాలు పొత్తు భవిష్యత్తుపై ఉత్కంఠను రేపుతున్నాయి.
