ఆంధ్రప్రదేశ్ శాసనసభ వింటర్ సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో ఏపీ ప్రభుత్వం అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న పెట్టుబడుల రక్షణ చట్టం (ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇది ఒక కీలక అడుగుగా నిలవబోతోంది.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు పొలిటికల్ ఈక్వేషన్స్, ప్రభుత్వ మార్పులతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం మెయిన్ టార్గెట్. గతంలో కూటమి ప్రభుత్వాలు మారినప్పుడు.. ఇండస్ట్రీలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో సడన్ పాలసీ మార్పులు జరిగి ఇన్వెస్టర్లు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా, ఇన్వెస్టర్స్కు దీర్ఘకాలిక భరోసా ఇచ్చేలా ఈ బిల్లును తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ కాన్ఫరెన్స్లో ఏకంగా రూ. 9.89 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ఏపీ పారిశ్రామిక ప్రయాణంలో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ భారీ ఒప్పందాలు గ్రౌండ్ అవ్వాలన్నా, పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని మరింత స్ట్రాంగ్ చేయాలన్నా ఈ రక్షణ చట్టం వేగంగా అమల్లోకి రావడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ అంశంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ .. పెట్టుబడిదారుల నుంచి తమకు ఈ చట్టంపై చాలా విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై గవర్నమెంట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కచ్చితంగా చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఇండస్ట్రియలిస్టుల సందేహాలను నివృత్తి చేస్తూ, పాలసీ స్థిరత్వాన్ని చట్టరూపంలో చూపించడమే కూటమి సర్కార్ ముందున్న ప్రధాన టార్గెట్గా కనిపిస్తోంది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలోని మెయిన్ సాగునీటి ప్రాజెక్టుల లేటెస్ట్ స్థితిగతులపై కూడా లోతైన చర్చ జరగనుంది. ప్రాజెక్టుల పనుల స్పీడ్, ఇప్పటివరకు జరిగిన పురోగతి, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్, సాగునీటి అంశాలతో ఈ వింటర్ సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
