ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్న విషయం తెలిసిందే . ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలను దగ్గర నుంచి వినడం, పార్టీకి కొత్త ఊపిరి తీసుకురావడం.. ఇలా ఒక లీడర్ పొలిటికల్ ఫ్యూచర్‌ను మార్చగల శక్తి పాదయాత్రకు ఉందన్నది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత లోకేష్, వైఎస్ జగన్,షర్మిల చేపట్టిన పాదయాత్రలు అందుకు ఉదాహరణలుగా నిలిచాయి. ఇలా కొద్దిరోజులుగా జగన్ పాదయాత్ర చర్చలోకి వస్తుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే కూడా చాలా ముందుగానే జగన్ జనంలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.
2027 చివరి 3 నెలల్లో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర స్టార్ట్ చేస్తానని గతంలోనే జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ముందు మార్చి.. మార్చి 2027 నుంచే పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీని కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నా.. జగన్ ఎందుకు ఇంత ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారనే ప్రశ్న మాత్రం అందరిలో వినిపిస్తోంది.
షెడ్యూల్ కంటే ముందే ఎందుకు?
2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఘోర పరాజయం ఆ పార్టీకి అతిపెద్ద రాజకీయ ఎదురుదెబ్బ. 2019లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి దర్జాగా వచ్చిన పార్టీ, 2024లో మాత్రం కేవలం 11 స్థానాలకే పరిమితమై నవ్వుల పాలయింది. ఈ ఫలితం పార్టీ నాయకత్వానికే కాదు కార్యకర్తలకు గట్టి సవాలుగా మారింది. ఓటమి తర్వాత తమ పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, నిరుత్సాహంలో ఉన్న కేడర్‌లో నమ్మకం పెంచడం ఆ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యాలు.
దీంతోనే జగన్ ముందుగానే పాదయాత్ర ప్రారంభిస్తే పార్టీకి రెండు ప్రయోజనాలుంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి.. ఏపీ వ్యాప్తంగా ప్రజలతో డైరెక్టుగా సంబంధాలు పెంచుకోవడం. రెండోది.. ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి కాకుండా, చాలా ముందుగానే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడం. అయితే ఈ స్ట్రాటజీ ఎంతవరకు ఫలిస్తుందనేది ప్రజల స్పందన, పార్టీ పనితీరుపైనే ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
గతంలో పాదయాత్రతో అధికారంలోకి.. ఇప్పుడు అదే ఫార్ములానా?
జగన్ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసంకల్ప యాత్ర అనేది చాలా పెద్ద కీలక ఘట్టం. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయిన ఈ జగన్ పాద యాత్ర 2019 జనవరిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు దాదాపు 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో జగన్ అప్పట్లో ఉన్న 13 జిల్లాల్లోని ప్రజలను కలిశారు. వారి సమస్యలు విన్నారు. ఆ సమయంలో జగన్ ఇచ్చిన నేను విన్నాను.. నేను ఉన్నాను అనే భరోసా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లింది.
ఆ పాదయాత్ర తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకుంది. దీంతో పాదయాత్ర జగన్ రాజకీయ ప్రయాణంలో ఒక మలుపుగా నిలిచింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా 2029 ఎన్నికలకు బలమైన పునాది వేయాలని ఆయన భావిస్తున్నట్లు తాజా రాజకీయ చర్చలు సూచిస్తున్నాయి.
అయితే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో కేవలం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీపైన విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీపైన, తన పాలనపైన, నేతల పనితీరుపై వచ్చిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈసారి పాదయాత్రలో జగన్ ఎదుర్కొనే సవాళ్లు మరింత భిన్నంగా ఉండొచ్చు.
ఈసారి మేనిఫెస్టో కూడా ప్రజల నుంచేనా?
ఈ పాదయాత్రలో ప్రతి జిల్లాలో ఎక్కువ సమయం గడపాలని, స్థానిక సమస్యలను తెలుసుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లు కథనంలో పేర్కొనబడింది. అంతేకాదు, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఉండాలనే విషయంపై ప్రజల నుంచే అభిప్రాయాలు సేకరించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, చిరు వ్యాపారులు.. ఇలా వేర్వేరు వర్గాల సమస్యలను డైరెక్టుగా తెలుసుకుని, వాటిని 2029 ఎన్నికల హామీల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేయొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి వచ్చే వినతులన్నిటిని నమోదు చేసుకుని, వాటి పరిష్కారానికి ఏం చేయాలనే అంశంపై వైసీపీ దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాలా?
అయితే జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే పాదయాత్ర ప్రారంభించాలనే ఆలోచన వెనుక మరో రాజకీయ కోణం కూడా ఉంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ తన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ యాత్రలో కీలకం కావొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ అంచనాలు నిజంగా ప్రజల్లో ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయనేది మాత్రం ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తాయి.
మరోవైపు కూటమి ప్రభుత్వానికి కూడా ఈ పాదయాత్ర ఒక రాజకీయ పరీక్షగా మారే అవకాశం ఉంటుంది. జగన్ ప్రజల్లోకి వెళ్లినప్పుడు ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఈ యాత్ర వైసీపీకి మాత్రమే కాకుండా అధికార పక్షానికి కూడా రాజకీయంగా ఈ యాత్రం ప్రాధాన్యం సంతరించుకోవచ్చు.
2029 వరకు జనంలోనే ఉంటారా?
ఈసారి జగన్ పాదయాత్ర 2028 డిసెంబర్ నెల వరకు కానీ అంతకంటే ఎక్కువ కాలం కానీ కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అంటే 2029 ఎన్నికలకు ముందు వరకు ప్రజల మధ్యే ఉండాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలపై ఇంకా అధికారికంగా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
మొత్తానికి జగన్ ముందస్తు పాదయాత్ర చర్చ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో చేపట్టిన పాదయాత్ర జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు రెండో పాదయాత్ర ఆయనకు రాజకీయంగా తిరిగి పుంజుకునే అవకాశాన్ని ఇస్తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధికారంలో ఉండగా ఘోరంగా ఫెయిలయిన జగన్ మాటలను ప్రజలు మరోసారి వినడానికి సిద్ధంగా ఉన్నారా? లేక ఈసారి ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుందనే విషయం కంటే.. ఆ యాత్రలో జగన్ ప్రజలకు ఏం చెబుతారు.. ప్రజలు జగన్ నుంచి ఏం ఆశిస్తారనేదే.. 2029 ఎన్నికలకు కీలకం కాబోతోంది.
