బంగారం ధరల పెరుగుదల, రుణ అర్హత మెరుగుపడటం వంటి రీజన్స్‌తో దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రెండేళ్ల కాలంలో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రెట్టింపు స్థాయికి చేరుకుని రూ. 15.6 లక్షల కోట్లకు ఎగబాకినట్లు క్రెడిట్ సమాచార సంస్థ నివేదికలు వెల్లడించాయి.
బంగారం విలువ పెరగడంతో తక్కువ గోల్డ్‌పై కూడా ఎక్కువ రుణం పొందే అవకాశం కస్టమర్లకు లభించింది. మరోవైపు, బలమైన తనఖా ఆస్తి ఉండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఈ రంగంలో లోన్స్‌ను జారీ చేయడానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
నివేదికల ప్రకారం, క్రియాశీలక గోల్డ్ రుణాల సంఖ్య 10.3 శాతం వరకూ పెరిగింది. ముఖ్యంగా రూ. 2.5 లక్షలకు మించిన రుణాల వాటా మొత్తం పోర్ట్‌ఫోలియోలో సుమారు సగానికి చేరుకుంది. గతంలో ఇది 36.4 శాతంగా ఉండేది. ప్రభుత్వ రంగ రుణదాతలు ఈ మార్కెట్లో సుమారు 60 శాతం వాటాతో అగ్రగామిగా నిలిచారు. మొత్తం రిటైల్ రుణ పోర్ట్‌ఫోలియోలో బంగారు రుణాల వాటా కూడా 8.1 శాతం నుంచి 9.7 శాతానికి పెరగడం ఈ విభాగం ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.
రాష్ట్రాల వారీగా చూస్తే, గుజరాత్లో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 67 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా, కర్ణాటక మరియు మహారాష్ట్రలలో 50 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. రుణగ్రహీతలలో పురుషుల వాటా 56 శాతానికి పైగా ఉన్నా కూడా, రుణాల చెల్లింపుల విషయంలో వుమెన్ బారోవర్స్ మెరుగైన క్రమశిక్షణను కనబరుస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి రుణ జారీ విలువలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే అధిగమించడం రుణ డిమాండ్ వేగాన్ని స్పష్టం చేస్తోంది.
అయితే, ఈ వేగవంతమైన వృద్ధితో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోన్ ప్రెజర్ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో చెల్లించని బకాయి రుణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక గుర్తించింది. మొత్తం మీద, పసిడి ధరల మద్దతుతో గోల్డ్ లోన్స్ వేగంగా పుంజుకుంటున్నా కూడా, తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
