ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ పులివెందులలో నిర్వహించిన ర్యాలీలో ఊహించని ఘటనా వికాసం చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి జగన్ పులివెందుల వీధుల్లో ర్యాలీగా వెళ్తుండగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సీబీఐ అప్రూవర్‌గా మారిన దస్తగిరి హఠాత్తుగా కాన్వాయ్‌కు ఎదురుపడ్డాడు.
దస్తగిరి డైరెక్ట్‌గా కాన్వాయ్ ముందుకు రావడమే కాకుండా.. సొంత బాబాయ్ వివేకాను చంపించి తమ జీవితాలను నాశనం చేశావ్ అంటూ పబ్లిక్‌గా గట్టిగా కేకలు వేశాడు. ఈ అనూహ్య పరిణామంతో వెహికల్లో ఉన్న జగన్‌తో పాటు వైసీపీ నాయకులు, భద్రతా సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దస్తగిరి జగన్ వాహనం వైపు మరింత ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా, అలర్ట్ అయిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకుని అక్కడి నుంచి పక్కకు లాగేయగా..జగన్ అది చూసీచూడనట్లుగా తన ర్యాలీతో ముందుకు వెళ్లిపోయారు.
షేక్ దస్తగిరి గతంలో మాజీ వివేకానంద రెడ్డి వద్ద చాలా కాలం డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా దారుణ హత్యకు గురైన తర్వాత నమోదైన కేసులో.. సీబీఐ దర్యాప్తులో దస్తగిరే కీలక నిందితుడిగా మారాడు. అయితే విచారణ సమయంలో నేరాన్ని అంగీకరించిన దస్తగిరి.. ఈ హత్య వెనుక జరిగిన కుట్రను, పాల్గొన్న పాత్రధారుల పేర్లను బయటపెడుతూ సీబీఐ ముందు అప్రూవర్‌గా మారాడు. అప్పటి నుంచి ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీలోని కొంతమంది కీలక నేతల పేర్లను బయటపెడుతూ ప్రకటనలు చేస్తూ వస్తున్న దస్తగిరి, తనకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నాడు.
అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ సొంత ఊరిలో ప్రచారం చేస్తుండటంతో, వివేకా హత్య కేసు అంశాన్ని మళ్లీ పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లడానికే దస్తగిరి ఇలాంటి నిరసనకు దిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా పులివెందుల నడిరోడ్డుపై మాజీ సీఎం ముందే ఆయనపై ఈ స్థాయి ఆరోపణలు చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ వర్గీయులు అంత ఈజీగా వదిలేయరన్న వార్తలు వినిపిస్తున్నాయి.
