వైఎస్సార్ ఫ్యామిలీలో కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో ఊహించని మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి హక్కుల విషయంలో కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహాన్ని ఆమె తండ్రి వైఎస్ఆర్ ఎంతో ఇష్టంగా తిరిగిన ఆ యలహంక ప్యాలెస్‌లోనే అట్టహాసంగా నిర్వహించాలని షర్మిల అనుకున్నారు. కానీ ఆ భవనం తనదేనంటూ జగన్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వివాదం కాస్తా వివాహ వేదిక రగడగా మారింది. కాగా ఈ పరిణామాలన్నింటిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశారు.
ఎక్స్ (Twitter) వేదికగా షర్మిల రాసుకొస్తూ, నాది కాని దానికోసం ఆశపడే నీచ మనస్తత్వం నాది కాదని.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా వందకు వంద శాతం తన భాగంలోకి, తన పిల్లల పేరిట వచ్చిందని అన్నారు. ఇది దేవుడి సాక్షిగా నిజం. సొంత ఇంట్లో బిడ్డ మ్యారేజ్ చేయాలనేది ఏ తల్లిదండ్రులకైనా అదృష్టమని.. నా బిడ్డ అంజలి కూడా అదే కోరుకుందని కానీ ఆ కోరికను నెరవేర్చలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దలు కుదిర్చిన అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి పెళ్లిని ఎలాంటి వివాదాలు, గొడవలు లాంటివి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తల్లిగా తనపై ఉందని షర్మిల అన్నారు. అందుకే యలహంక ఇంట్లో కాకుండా ఈ కళ్యాణాన్ని వేరే వేదికపై బంధుమిత్రుల సమక్షంలో జరిపించాలని నిర్ణయించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశఆరు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని షర్మిల కోరుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతుంది.
