ఏపీలో మున్సిపల్ పోరుకు సంబంధించిన అసలు ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏపీవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో పురపాలక పోరుకి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల తర్వాత ఏకంగా 8 పురపాలికలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. దీంతో నవంబర్ 1న 92 పట్టణ స్థానిక సంస్థల్లోనే పోలింగ్ ప్రాసెస్ సాగనుంది.
మొత్తంగా చూస్తే 13 నగరపాలక సంస్థలతో సహా 79 మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీల పరిధిలోని 2వేల382 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనిలో కార్పొరేటర్, ఛైర్‌పర్సన్, మేయర్, కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి 6,669 మంది అభ్యర్థులు తమ ఫ్యూచర్‌ను తేల్చుకోవడానికి బరిలో ఉన్నారు. శనివారం ఉదయం నుంచే పోలింగ్ సిబ్బంది సంబంధిత ఆఫీసుల నుంచి ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన సెంటర్లకు బయలుదేరారు.
ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ల పరిధిలోనే పొలిటికల్ వేడి ఎక్కువగా ఉంది. 13 మేయర్ స్థానాల కోసం 153 మంది కేండిడేట్స్ తలపడుతున్నారు. 922 డివిజన్లలో 118 చోట్ల ఏకగ్రీవాలు ఫిక్స్ అయిపోగా , మిగిలిన 804 స్థానాల్లో 3వేల73 మంది అభ్యర్థుల కోసం 6వేల384 పోలింగ్ కేంద్రాలు రెడీ చేశారు. దీనిలో సుమారు 59.97 లక్షల మంది ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోబోతున్నారు.
ఇక మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విషయం చూస్తే.. 87 ఛైర్‌పర్సన్ పదవుల్లో 17 స్థానాలు ఇప్పటికి ఏకగ్రీవమవగా, మిగిలిన 70 చోట్ల 367 మంది బరిలో నిలబడ్డారు. 3వేల20 వార్డులకు గానూ 637 ఏకగ్రీవమవడంతో 2వేల382 స్థానాలకు 6వేల669 మంది అభ్యర్థులకు 5వేల321 కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఇక్కడ సుమారు 39.38 లక్షల మంది ఓటర్లు పాల్గొంటారు.
పిడుగురాళ్ల, గురజాల, దర్శి, దాచేపల్లి,రాయచోటి, ప్రొద్దుటూరు, కమలాపురం, ఆళ్లగడ్డలో పాలకవర్గాలు మొత్తం ఏకగ్రీవం కాగా, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 20వ వార్డులో నామినేషన్లు అన్నీ కూడా ఉపసంహరించుకోవడంతో అక్కడ మాత్రం పోలింగ్ జరగడం లేదు. రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలకు రెడీగా ఉంటూనే, 11వేల705 కేంద్రాల వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన భద్రత మధ్య పుర పోరుకు రంగం సిద్ధం చేశారు.
