ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. అనూహ్యంగా 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకున్నారు. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదితో సరిగ్గా రెండున్నరేళ్ల పాలనను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంది..? మరోసారి కూటమి విజయం గెలుస్తుందా..? రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసే ఉంటాయా.. లేక విడిపోతాయా..? మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరుంటారు..? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారిన ప్రశ్నలు.
ఏపీలో 2024 ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఎన్నికల హామీలు ఇచ్చారు. వీటిని దాదాపు పూర్తి చేశామనేది ప్రస్తుతం కూటమి నేతలు చెబుతున్న మాట. ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే.. అంత మందికి రూ.15 వేలు జమ చేస్తామనే హామీ, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.వెయ్యి పెంపు.. వంటి హామీలు ఉన్నాయి. ఈ పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి. కానీ వీటిని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లడంలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ. వెయ్యి పెంచి.. మొత్తం రూ.4 వేలు ఇస్తున్నారు. వీటిని ప్రతి నెలా ఒకటో తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే స్వయంగా లబ్దిదారులకు అందిస్తున్నారు. కానీ.. గతంలో వైసీపీ అధికారంలో వాలంటీర్లతో పంపిణీ చేసినప్పుడు వచ్చిన ప్రచారం ఇప్పటికీ రాలేదు. ఇక గతంలో అమ్మఒడి పథకాన్ని తల్లికి మాత్రమే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఇప్పటికీ అమ్మఒడి అనే పేరు ఇంకా వినిపిస్తోంది. రెండేళ్లు దాటినా కూడా.. ఇప్పటికీ తల్లికి వందనం అనే పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి నేతలు పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం అంటే.. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నట్లుగా చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన, బీజేపీ నేతలు మాకెందుకు వచ్చింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప.. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను సమిష్టిగా తిప్పి కొట్టటం లేదు. మా పార్టీని కాదు అనేది అన్నట్లుగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి ప్రతికూలం. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కూడా కేవలం టీడీపీ నేతలే చేస్తున్నారు తప్ప.. ఎక్కడా బీజేపీ నేతలు కనిపించటం లేదు. ఇది కూటమిలో విభేదాలను బహిర్గతం చేస్తోంది.
ఏపీలో చంద్రబాబు పైన, ఆయన పాలనపైన ప్రజల్లో ఇప్పటికీ నమ్మకం అలాగే ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచిస్తారని.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం మెజారిటీ ప్రజల్లో ఉంది. అయితే ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులపై మాత్రం తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతమున్న మంత్రులు,ఎమ్మెల్యే, ఎంపీలపై అవినీతి ఆరోపణలు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, మద్యం అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని.. పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంత మంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మళ్లీ టికెట్ ఇస్తే.. ఓటమి ఖాయమని బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలపై భూ కబ్జాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెటిల్‌మెంట్లు, కబ్జాలకే తప్ప.. ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదనేది ప్రధాన ఆరోపణ. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించటం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీని వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయనేది కూటమి నేతలు చెబుతున్న మాట. అయితే ఒప్పందం చేసుకున్న సంస్థలు తమ పనులు ప్రారంభించాయా.. లేదా.. అనే విషయంపై ఇప్పటి వరకు కనీసం ఎవరికీ తెలియదు. అసలు సంస్థలు తమ పనులు మొదలుపెట్టాయో లేదో కూడా తెలియదు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు కూడా జరిగాయి. అయితే.. వాటిల్లో ఇప్పటి వరకు చాలా సంస్థలు పనులు మొదలుపెట్టలేదు. దీనిపై స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు.. పనులు ఎప్పుడు మొదలుపెడతారు.. పూర్తి ఎప్పుడు చేస్తారు.. ఉద్యోగులు ఎప్పుడు ఇస్తారు.. అనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటి పైన ప్రతి రోజు అప్‌డేట్ వస్తుంది. అదే మాదిరిగా పరిశ్రమల పనులపై కూడా ప్రజలకు అప్‌డేట్ ఇస్తే బాగుంటుందంటున్నారు. అలా చేస్తే.. ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధుల్లో కూడా భయం ఉంటుందంటున్నారు.
ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో నత్త నడకన సాగిన సాగునీటి ప్రాజెక్టుల పనులను కూటమి ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో పూర్తి చేస్తోంది. కరువు ప్రాంతాలకు కూడా తాగు, సాగు నీరు అందిస్తోంది. ఇందుకు ఉదాహరణ వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు సాగు నీరు, పులివెందులకు తాగు నీరు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి వల్ల ఆయా ప్రాంతాలకు ఎంతో మేలు జరిగింది. అయితే దీని గురించి సరైన ప్రచారం జరగటం లేదనేది వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం క్యాడర్‌లో నిరుత్సాహం. పదవులు రాలేదని, గుర్తింపు లేదనేది క్యాడర్ బాధ. అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా కూడా.. ఎన్నికల్లో, ముందు కష్టపడిన వారికి, కేసులు, దాడులతో ఇబ్బందులు పడిన వారికి, ఆర్థికంగా నష్టపోయిన వారిలో చాలా మందికి ఎలాంటి పదవులు రాలేదు. వస్తాయనే మాట పెద్దలు చెబుతున్నప్పటికీ.. అవి ఎప్పుడు వస్తాయనేది క్యాడర్ సూటి ప్రశ్న. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి ప్రచారం చేసేందుకు అంతగా ఆసక్తి చూపించటం లేదు. ఇదే వైసీపీ నేతలకు అనుకూలంగా మారింది. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల పూర్తి జగన్ వల్లే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. దీనిని సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలో టీడీపీ నేతలు, టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు మాత్రం.. మమ్మల్ని కాదు అనేది అన్నట్లుగా సైలెంట్ అయ్యారు.
మరో కీలక అంశం జనసేన పార్టీలో చేరికలు. ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ కీలక నేతలు చేరుతున్నారు. వీళ్లంతా గతంలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన వారే. అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే ముందు కూటమిలోని ఇతర పార్టీల స్థానిక నేతల నుంచి కనీసం చర్చించటం లేదని.. వారి అభిప్రాయం తీసుకోవటం లేదనేది ప్రధాన ఆరోపణ. దీని వల్ల భవిష్యత్తులో టీడీపీ, జనసేన పార్టీల నేతల మధ్య విభేదాలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తేనే దాని ప్రభావం ఓటర్లపై స్పష్టంగా ఉంటుంది. అలా కాకుండా.. ఎవరి వారే అన్నట్లుగా ఉంటే.. ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రభావం చూపించడం ఖాయం.
తెలుగుదేశం పార్టీలో మరో కీలక అంశం సీనియర్లకు లోకేష్‌కు మధ్య గ్యాప్ ఉందనే మాట. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారని.. ఇదంతా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే కీలక పదవుల్లో కూడా సీనియర్లకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కలేదు. మొన్నటి టీడీపీ నూతన కార్యవర్గంలో కూడా సీనియర్ల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోలేదనే మాట బాగా వినిపిస్తోంది. ఇది సీనియర్లలో అసహనానికి కారణం. నాకు చాలా కోపంగా ఉంది.. చాలా ఇబ్బందిగా ఉంది.. ఎప్పుడో బ్లాస్ట్ అవుతా.. అంటూ గోదావరి జిల్లాలకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి కూడా. దీనిని పరిష్కరించకపోతే.. తీవ్ర ప్రభావం తప్పవు. ప్రతికూల ఫలితాలు వస్తాయి.
మరో అంశం.. పవన్, లోకేష్ మధ్య గ్యాప్ అనే ప్రచారం.. ఈ ప్రచారం క్యాడర్ పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు “సీఎం అభ్యర్థి మా వాడే..” అంటున్నారు. ఈ స్థాయిలో పోరు జరుగుతోంది. ప్రతి బహిరంగ సభలో పవనన్న.. అంటూ లోకేష్ అంటున్నారు.. కూటమి పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందని పవన్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అయినా సరే.. పవన్, లోకేష్ మధ్య విభేదాలు.. ఆధిపత్య పోరు.. పపన్ మాట లెక్క చేయని లోకేష్.. అనే ప్రచారం మాత్రం బాగా వినిపిస్తోంది. ఈ ప్రచారానికి ఇరు పార్టీల అగ్రనేతలు పుల్‌స్టాప్ పెట్టకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే పవన్, లోకేష్ మధ్య చక్కటి బంధం ఉందనేలా ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేయాలి. అలా చేస్తేనే.. క్యాడర్‌లో నమ్మకం వస్తుంది.
