ఏపీలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఈ స్థానిక సమరంలో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలబడొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు క్లిష్టంగా మారడం, కొన్నిచోట్ల తమకు కేటాయింపులు దక్కలేదని జనసైనికులు అసంతృప్తి చెందడం వంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఈ ఫ్రీ హ్యాండ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా లోకల్ బాడీస్ బలోపేతమే లక్ష్యంగా జరుగుతాయని పవన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు, సీట్ల సద్దుబాట్లు ఉండవని, ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయడానికి పొలిటికల్‌గా ఎలాంటి అడ్డంకులు ఉండబోవని పవన్ తేల్చిచెప్పారు. పోటీ చేయాలనుకునే శ్రేణులను ఏ లీడర్ అడ్డుకోకూడదని, ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది పార్టీ అభిమతమని పవన్ ఈరోజు అంటే నవంబర్ 22వ తేదీ ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
మరోవైపు బరిలో నిలిచే కేండిడేట్స్‌కు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించడానికి జనసేన ఒక స్పెషల్ హెల్ప్ డెస్క్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. పోటీదారులు ఎదుర్కొనే చట్టపరమైన లేదా టెక్నికల్ సమస్యలను పరిష్కరించి, వాటిని పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లేలా ఈ సిస్టం పనిచేస్తుంది. ఈ హెల్ప్ డెస్క్ బాధ్యతలన్నిటినీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
