ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రశంసలు కురిపించారు. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన తనకు ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఉపాసన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అగ్రహారంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అపోలో ఫౌండేషన్ చేపట్టిన ‘అపోలో ఆరంభ్’ కార్యక్రమంలో భాగంగా కొణిదెల కుటుంబం సహకారంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ.. ప్రజలకు పవన్ కల్యాణ్ ‘పవర్ స్టార్’గా తెలుసని, అయితే పిఠాపురంలో ఆయన చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసిన తర్వాత తనకు ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారని అన్నారు. పర్యాటకం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతపై ఆయన చూపుతున్న శ్రద్ధను అభినందించారు.మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు నైపుణ్య శిక్షణ, రుణాల సదుపాయం కల్పించే ప్రయత్నాలను ప్రశంసించారు.
పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను మెరుగుపరిచేందుకు అపోలో ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా 109 మోడల్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి కేంద్రాన్ని పిఠాపురంలో ప్రారంభించారు.
