ఒకప్పుడు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని వాటికి వెల్కమ్ చెప్పేవారు. అయితే ఇప్పుడు డేటా సెంటర్లు వస్తామంటున్నా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి కావాల్సిన పవర్, నీటి వినియోగం, పర్యావరణ ప్రభావమే కారణం. మరోవైపు అమెరికాలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి.
2026 మధ్యంతర ఎన్నికల్లోనూ ఈ అంశం పొలిటికల్ చర్చగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డేటా సెంటర్ల నిర్మాణాన్ని పరిమితం చేయాలన్న ప్రతిపాదనలకు ఓటర్లు సపోర్ట్ తెలిపారు. ఇదే టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తమ దేశ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తే భారీ పన్ను విధిస్తామని ప్రకటించారు. అంటే ఒకవైపు ప్రజల వ్యతిరేకత.. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో భారీ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమేనా? వాటితో ఆంధ్రప్రదేశ్‌కి నిజంగా ఎంత ప్రయోజనం ఉంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు?
కృత్రిమ మేధ (AI) యుగంలో డేటా సెంటర్లు చాలా ఇంపార్టెంట్ అయిన మౌలిక సదుపాయాలుగా మారాయి. మనం ఉపయోగించే సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్, వీడియో స్ట్రీమింగ్ నుంచి ఏఐ చాట్బాట్ల వరకు ఎన్నో సర్వీసుల వెనుక డేటా సెంటర్లే ఉంటాయి. భారీ కంప్యూటర్లు, సర్వర్లు కంటిన్యూగా పనిచేస్తూ సమాచారాన్ని నిల్వ చేస్తాయి, ప్రాసెస్ చేస్తాయి.
నవంబర్ 20వ తేదీన ట్రంప్ అమెరికన్ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మించకుండా నిరుత్సాహపరచడానికి భారీ ట్యాక్స్ విధిస్తామని ప్రకటించారు. ఏఐ రంగంలో చైనాతో పోటీపడాలంటే కంప్యూటింగ్ కెపాసిటీ అమెరికాలోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు.
ఏపీకి డేటా సెంటర్లతో వచ్చే లాభాలేంటి?
ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతాన్ని భారీ డేటా సెంటర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్, అదానీ గ్రూప్ పార్ట్నర్షిప్తో ప్రకటించిన భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు ఈ దిశలో కీలకమైన అడుగు. ఇలాంటి ప్రాజెక్టులు ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు డిజిటల్ రంగంలో కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తాయి.
డేటా సెంటర్ల వల్ల డైరెక్టుగా సర్వర్ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజినీరింగ్, కూలింగ్ సిస్టమ్స్, పవర్ మ్యానేజ్మెంట్ వంటి రంగాల్లో జాబ్స్ ఏర్పడతాయి. పరోక్షంగా నిర్మాణ రంగం, ట్రాన్స్పోర్ట్, భద్రత, నిర్వహణ, స్థానిక సేవల రంగాలకు కూడా పని దొరుకుతుంది. అంతేకాదు, డేటా సెంటర్లు అందుబాటులో ఉంటే ఇతర టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఏపీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇది బలంగా మారొచ్చు.
ఇక్కడే అసలు ప్రాబ్లెమ్ మొదలవుతుంది. డేటా సెంటర్లు సాధారణ ఇండస్ట్రీస్లా ఉండవు. వీటిలో వేల సంఖ్యలో సర్వర్లు కంటిన్యూగా పని చేస్తుంటాయి. వాటిని కూల్‌గా ఉంచడానికి కూలింగ్ వ్యవస్థలు అవసరం. భారీ రేంజ్లో పవర్ వినియోగం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ విధానాల్లో నీటి అవసరం కూడా గణనీయంగా ఉంటుంది.
విశాఖపట్నం దగ్గరలో ప్రతిపాదించిన డేటా సెంటర్ పార్కులకు సంబంధించి రోజుకు దాదాపు 500 కిలోలీటర్ల వాటర్ అవసరమవుతుందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అనుమతులు, అటవీ ప్రాంతాలకు దగ్గర, పర్యావరణ పరిశీలన, స్థానికు అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారా అనే ప్రశ్నలను లేవనెత్తారు. ఇవి ప్రాజెక్టు స్టాప్ చేయాలనే నిర్ధారణలు కాకపోయినా, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు.
జాబ్ విషయంలో మరో సమస్య ఉంది. భారీ పెట్టుబడి పెట్టినంత మాత్రాన వేలాది పర్మినెంట్ ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం పొరపాటు. స్టార్టింగ్ స్టేజిలో ఎక్కువ మందికి పని దొరికినా, నిర్వహణ దశలో స్కిల్ ఉన్న పరిమిత సిబ్బందే అవసరం కావొచ్చు. కాబట్టి పెట్టుబడి మొత్తాన్ని మాత్రమే కాకుండా, లోకల్‌గా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంత ఇన్కమ్ ఏపీకి వస్తుందన్నది కూడా లెక్కించాలి.
డేటా సెంటర్లు వద్దనడం డెవలప్మెంట్ను అడ్డుకోవడమే అవుతుంది. అదే సమయంలో పర్యావరణం, ప్రజల అవసరాలను పక్కనపెట్టి అనుమతులు ఇవ్వడం కూడా సరైన విధానం కాదు. ప్రాజెక్టులకు అవసరమైన పవర్‌ను రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా సమకూర్చే ప్రణాళిక ఉండాలి. వాటర్ వాడకాన్ని తగ్గించే లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీ, శుద్ధి చేసిన మురుగునీటి వినియోగం, పారదర్శక పర్యావరణ పరిశీలనలు తప్పనిసరిగా చేయాలి. పక్కనే ఉన్న గ్రామాలకు వాటర్, పవర్ సప్లైపై ఎలాంటి భారం పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.
చివరగా చెప్పాలంటే.. డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద అవకాశమే అని చెప్పాలి. కానీ ఆ ఛాన్స్‌ను ఆదాయంగా, ఉద్యోగాలుగా, టెక్నికల్ డెవలప్‌మెంట్‌గా మార్చగలిగితేనే వాటి ఏర్పాటు సార్థకమవుతుంది. ట్రంప్ అమెరికాలో డేటా సెంటర్లు ఉండాలని కోరుకుంటున్నారు. ఏపీ కూడా వాటిని అట్రాక్ట్ చేయాలనుకుంటోంది.
కానీ ప్రభుత్వం టార్గెట్ కేవలం భారీ పెట్టుబడులను సాధించడమే కాకూడదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రకృతికి లాస్ జరగకుండా, ఏపీకి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా ప్రాజెక్టులను నిర్వహించాలి. డేటా సెంటర్లు రావాలా వద్దా అనేది ప్రశ్న కానే కాదు.. అవి వచ్చిన తర్వాత ఏపీకి ఎంత మేలు జరుగుతుందన్నదే ప్రభుత్వం ముందున్న అసలు ప్రశ్న.
