కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) బుక్ తర్వాత భారత రాజకీయాలలో రోజుకో వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య వెనుక ఉన్న భద్రతా లోపాలపై ఆయన కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, ప్రియాంకలతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన తండ్రి భద్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని, ఆ దారుణం జరగడానికి పరోక్షంగా వారి మార్గాన్ని సుగమం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
రాజీవ్ గాంధీని టార్గెట్‌గా చేసుకుని హంతకులు దాడి చేయడానికి అప్పట్లో ఉన్న భద్రతా వ్యవస్థల సడలింపే ప్రధాన కారణమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక దేశ మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్‌ను హఠాత్తుగా తొలగించడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు అప్పటి రాజకీయం, నిర్ణయాధికారుల తీరుపై మళ్లీ అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
శ్రీపెరంబుదూరులో 1991లో రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ ఆత్మాహుతి దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు జరిగి నిందితులకు శిక్షలు పడినా కూడా కూడా, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎందుకు పాటించలేదనే దానిపైన అలాగే అలాంటి కీలక నేతకు భద్రత తగ్గించడానికి వెనుకాడిన శక్తులు ఏవనే కోణంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సోనియా గాంధీ తన బుక్‌లో ఆనాటి చేదు జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకోవడం వల్ల ఈ సున్నితమైన అంశం మళ్లీ నేషనల్ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి బిలాంగింగ్ పుస్తకం కేవలం సోనియా గాంధీ లైఫ్ జర్నీని మాత్రమే కాకుండా, రాజీవ్ గాంధీ హత్య కేసులోని దశాబ్దాల నాటి నిగూఢ ప్రశ్నలను కూడా బయటకు తీసినట్లు అయింది. మరి రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ ఆరోపణలపై అధికార, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఫ్యూచర్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
