ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఒక పంచాయతీ ఎన్నికలు ఒకటే పెండింగ్ ఉండటంతో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పార్టీ ప్రకటననకు డెడ్ లైన్ దగ్గర పడతుండటంతో అందరి కళ్లూ 11వ తేదీ వైపే చూస్తున్నాయి.
ఇటు పార్టీ ఆవిర్భావానికి డేట్ దగ్గర పడుతుండటంతో విజయసాయి రెడ్డి తన పొలిటికల్ స్పీడ్‌ను అమాంతం పెంచేశారు. ఒకవైపు సోషల్ మీడియాలో గ్రౌండ్ వర్క్‌ను నడిపిస్తూ, మొన్నటికి మొన్న ప్రత్యేకంగా ఒక ప్రచార సాంగ్ రిలీజ్ చేసి జనాల్లోకి దూసుకెళ్లిన ఆయన, ఇప్పుడు ఎక్స్ వేదికగా పెట్టిన పదునైన పోస్ట్‌తో రాజకీయాన్ని పూర్తిగా హీటెక్కించారు.
నవంబర్ 11న ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనుండటంతో..రోజురోజుకూ ఆయన వేస్తున్న అడుగులు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేవలం అనౌన్స్‌మెంట్‌తో సరిపెట్టకుండా ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఏపీలో తిష్ట వేసిన రెండు ప్రధాన కుటుంబాల దోపిడీకి, ఏకగ్రీవాల అరాచకాలకు చెక్ పెట్టడానికి తాను ఈ కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకువస్తున్నానని విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) అన్నారు. కేవలం కొద్దిమంది కుటుంబాలు మాత్రమే బాగుపడటమనేది కాకుండా, ఏపీలోని కోటిన్నర కుటుంబాలు కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా వారి ఇన్‌కమ్‌ను పెంచడమే తన పార్టీ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.
ఒకరు కులాల విత్తనాలను, మరొకరు మత మార్పిడిల విత్తనాలను వేసి రాజకీయ పంట పండించుకుంటున్నారని విమర్శించిన విజయసాయి రెడ్డి.. బీహార్‌ను మించేలా ఏపీలోని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని మండిపడ్డారు. ఒకరు రెడ్ బుక్ పాలన అంటుంటే, మరొకరు రప్పారప్పా పాలన అంటూ 2029 ఎజెండాలను ప్రకటిస్తూ వస్తున్నారని, ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడి సామాన్యుడిని కూడా ఉన్నత స్థానాలకు చేర్చేలా తన పోరాటం ఉంటుందని తేల్చిచెప్పారు. మొత్తానికి లాంచింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ విజయసాయి రెడ్డి వేస్తున్న ప్రతీ అడుగు ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్‌ను వేగంగా మారుస్తోంది.
