అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమిషనర్, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే చర్చిస్తానని చెప్పారు.
బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నారాయణను కలిశారు. సొసైటీ సభ్యుల గృహ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ అంశాలను మంత్రికి వివరించారు. జీఓ ఎంఎస్ నంబర్ 107, దాని అమలుకు సంబంధించిన అంశాలతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కూడా సమర్పించారు.
సంబంధిత అధికారులతో చర్చించి హౌసింగ్ స్కీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మంత్రి హామీతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ స్కీమ్‌కు పరిష్కారం లభిస్తుందని సొసైటీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
