ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (AP VROs Association) 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. విజయవాడ రెవెన్యూ భవన్లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్వోలు పాల్గొన్నారు. ఎలాంటి పోటీ లేకుండా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శిగా ఎం. బాపూజీ ఎన్నికయ్యారు. సహ అధ్యక్షుడిగా టి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలిగా జి. అనుపమ, ప్రచార కార్యదర్శిగా జి. దిల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. సాహితి ఎన్నికయ్యారు.
APRSA రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వీఆర్వోల ఏకగ్రీవ ఎన్నికలు వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్వోల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. బాధ్యత, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఉద్యోగుల హక్కులు, సంక్షేమంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన కార్యవర్గం తెలిపింది.
